Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల
- Author : Vamsi Chowdary Korata
Date : 30-06-2026 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని లక్షల మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం నేడు తొలి విడత నిధులను విడుదల చేయనుంది. మొదటి విడత కింద రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 2,482.02 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్‌ట్యాప్‌లో బటన్ నొక్కి ఈ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ భారీ రైతు ఆశీర్వాద సభను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ సభ నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తక్షణమే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు.
రాష్ట్రంలోని మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాల సాగుభూమికి గానూ, ఎకరానికి రూ. ఆరు వేల చొప్పున మొత్తం రూ. 9 వేల కోట్లను దశలవారీగా విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. అందులో భాగంగానే ప్రాధాన్యత క్రమంలో మొదటగా తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు తొలి విడత సాయం అందుతుందన్నారు. రైతు భరోసా నిధుల బదిలీ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముంబయిలోని ఆర్బీఐ కార్యాలయానికి, హైదరాబాద్‌లోని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి, అలాగే అన్ని వాణిజ్య, గ్రామీణ బ్యాంకులకు ముందస్తు సమాచారం అందించింది. రైతుల ఖాతాల్లో జమ అయ్యే ఈ సాయాన్ని బ్యాంకులు వారి పాత రుణ బకాయిల కింద మినహాయించుకోవడానికి వీల్లేదని, ఈ నిధులు పూర్తిగా రైతుల సాగు అవసరాలకే దక్కేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 2500 మంది రైతులు హాజరుకానున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు తమ పరిధిలోని రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారంలో భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. అలాంటి వారు జులై 5వ తేదీ లోపు తమ సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి, తమ భూమి వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే వారు కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయం పొందేందుకు అర్హులవుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.