Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!
- Author : Vamsi Chowdary Korata
Date : 29-06-2026 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
మన జీవనశైలే… అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి, మానసిక కుంగుబాటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటి కోసం రోజువారీగా ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. అదే సమయంలో ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటే… ఈ ఔషధాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. కొన్ని రకాల ఔషధాలను ఆల్కహాల్‌తో అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే వ్యతిరేక ప్రభావం జరుగుతుంది.
అలెర్జీ నివారణకు….
బెనడ్రిల్ అనేది దగ్గు మందు. దీని గురించి అందరికీ తెలుసు. దీనితో పాటు ఇతర అలెర్జీ, జలుబు నివారణకు వాడే యాంటీ హిస్టామిన్ ఔషధాలను ఆల్కహాల్‌తో కలవకుండా చూసుకోవాలి. ఇవన్నీ కలిపి తీసుకున్నట్లయితే తీవ్రమైన మగత ఆవహిస్తుంది. దీనివల్ల నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎపిలెప్సీ మందులు…
మూర్ఛ నివారణకు వాడే మందు బిళ్లలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోకూడదు. మూర్ఛ రాకుండా చూసుకోవడం చాలా కీలకం. కాబట్టి ఈ మందులకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మూర్ఛలు మళ్ళీ వస్తుంటాయి. ఆల్కహాల్ సేవించిన తర్వాత మూర్ఛ నివారణ ఔషధాలను తీసుకోవడం వల్ల అవి పనిచేయకుండా పోతాయి.
యాంటీ డిప్రెసెంట్స్ ..
జ్ఞాపకశక్తి కోల్పోవడం, నాడీ మండల వ్యవస్థ బలహీనత, శ్వాస నిదానంగా తీసుకోవడం అనేవి యాంటీ డిప్రెసెంట్ ఔషధాలను ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల వస్తాయి.
మధుమేహం….
మన దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగుతోంది. గ్లూకోఫేజ్, ఒరినేస్, డయ్ బినేస్ వంటి ఔషధాలను షుగర్ నియంత్రణ కోసం వైద్యులు సూచిస్తుంటారు. వీటిని తీసుకునేటప్పుడు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే గుండె స్పందనలు వేగంగా పెరిగి ప్రమాదం ఉంటుంది.
గుండె జబ్బుల మందులు…
ఛాతీలో నొప్పి వచ్చి, గుండె వైద్యులను సంప్రదించనట్లయితే, గుండె జబ్బులు రాకుండా నివారణ మందులు ఇస్తారు. కానీ ఇవి తీసుకునేటప్పుడు ఆల్కహాల్‌ను దూరం పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో గడ్డలు ఏర్పరకుండా వైద్యులు సూచించే మందులను కూడా ఆల్కహాల్‌తో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల అంతర్గత రక్తస్రావం ఏర్పడుతుంది. ఔషధాల వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాటి పట్ల మరింత అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే ఔషధాలను సిఫారసు చేసిన వైద్యుడిని అడిగి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.