Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్‌లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది
- By Praveen Aluthuru Published Date - 09:47 PM, Tue - 20 August 24

Women’s T20 World Cup: ఊహించిందే జరిగింది….ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ వేదిక మారబోతోంది…బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని ఐసీసీ తేల్చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకూ బంగ్లాదేశ్ వేదికగా వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల కారణంగా దేశంలో హింస చెలరేగింది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటకీ టోర్నీని సజావుగా నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ దేశ ఆర్మీ సాయం కోరింది. దీని కోసం ఐసీసీని కొంచెం సమయం కూడా కోరినప్పటకీ… అక్కడి తాజా పరిస్థితుల మధ్య మెగా టోర్నీని మరోచోటుకు తరలించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్‌లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది. గత ఏడాది ఆసియాకప్ కూడా ఇక్కడే నిర్వహించారు. దీనికి తోడు ప్రస్తుతం బంగ్లాలో జరుగుతున్న అల్లర్ల మధ్య వరల్డ్ కప్ అక్కడ నిర్వహించడం సరికాదని ఆసీస్ మహిళా కెప్టెన్ అలెస్సీ హీలీ కూడా అభిప్రాయపడింది. బయట అలాంటి టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మ్యాచ్ లపై ఏకాగ్రత ఉండదని, స్టేడియాలకు అభిమానులు కూడా రాలేరని చెప్పుకొచ్చింది. అటు ఐసీసీలో కూడా మెజార్టీ సభ్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో వేదిక మార్పుకే ఐసీసీ మొగ్గుచూపినట్టు సమాచారం. దీనిపై ఐసీసీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో మొత్తం 23 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఎనిమిది టీమ్స్ అర్హత సాధించగా.. క్వాలిఫై రౌండ్ల ద్వారా స్కాట్లాండ్, శ్రీలంకలు ప్రపంచం కప్ లో పాల్గొనబోతున్నాయి.ఈ మెగా టోర్నీలో టీమిండియా తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 4న న్యూజిలాండ్ తో ఆడనుంది. ఆ తర్వాతఅక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత మహిళల జట్టు తలపడుతుంది.
Also Read: Nagar Kurnool: తీవ్ర విషాదం: డెంగ్యూతో బీటెక్ విద్యార్థిని మృతి