FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..
- Author : Vamsi Chowdary Korata
Date : 11-03-2026 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
FBI అమెరికాలో 11 ఏళ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న భద్రేశ్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రివార్డును భారీగా పెంచింది. అతని ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే రివార్డును 2,50,000 డాలర్ల నుంచి ఏకంగా 1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 9.18 కోట్లు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎఫ్‌బీఐ ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ జాబితాలో భద్రేశ్‌కుమార్ ఉన్నాడు.
The #FBI now offers a reward of up to $1,000,000 for information leading to the arrest of Ten Most Wanted Fugitive Bhadreshkumar Patel, wanted for allegedly killing his wife at a donut shop in Hanover, Maryland, on April 12, 2015: https://t.co/tCZ0Fde7WQ pic.twitter.com/en5jYcfpJG
— FBI Most Wanted (@FBIMostWanted) March 10, 2026
వివరాల్లోకి వెళితే… 2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో ఉన్న ఓ డంకిన్ డోనట్ షాపులో భద్రేశ్‌కుమార్, అతని భార్య పాలక్ పటేల్ (21) నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నారు. ఈ సమయంలోనే భార్యను దారుణంగా హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. షాపులోని సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరూ కిచెన్ వైపు వెళ్లడం రికార్డయింది. ఆ తర్వాత కొంతసేపటికి కస్టమర్లు వచ్చి పిలిచినా ఎవరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా, కిచెన్‌లో పాలక్ మృతదేహం లభ్యమైంది.
దర్యాప్తు ప్రకారం భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని పాలక్ కోరుకోవడం, దీనికి భద్రేశ్‌కుమార్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఘటన జరిగిన రోజు పాలక్ తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్వాదం పెరిగి హత్యకు దారితీసిందని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. హత్య తర్వాత, దగ్గరలోని తమ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి కొన్ని వస్తువులు, నగదు తీసుకుని ట్యాక్సీలో న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి నెవార్క్ పెన్ స్టేషన్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభ్యం కాలేదు.
గత 11 ఏళ్లలో 300కు పైగా ఆధారాలు లభించినప్పటికీ, భద్రేశ్‌కుమార్‌ను పట్టుకోలేకపోయామని అధికారులు చెబుతున్నారు. “ఈ 1 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటనతో మా అన్వేషణకు మరింత ప్రచారం లభించి, పాలక్‌కు న్యాయం చేయడానికి అవసరమైన సమాచారం వస్తుందని ఆశిస్తున్నాం” అని ఎఫ్‌బీఐ బాల్టిమోర్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ జిమ్మీ పాల్ తెలిపారు. టీచర్ కావాలని కలలు కన్న పాలక్‌ను ఆమె కుటుంబం ఎంతగానో మిస్ అవుతోందని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రజల సహాయం కీలకమని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.