RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?
ఐపీఎల్‌లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్‌గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Gopichand Published Date - 06:58 PM, Wed - 1 October 25

RCB: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరి ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుని అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీపై ఇప్పుడు పెను సంచలనం రేకెత్తించే వార్త ఒకటి చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఈ ఫ్రాంచైజీని ప్రస్తుత యజమాని డియాజియో (Diageo) విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
2 బిలియన్ డాలర్ల రికార్డు డీల్
నివేదికల ప్రకారం.. ఈ డీల్ గనుక కార్యరూపం దాల్చితే RCB విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 16,600 కోట్లు) ఉండే అవకాశం ఉంది. ఈ ధరతో RCB విక్రయం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డియాజియో సంస్థ ఈ అమ్మకంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ అంతర్గత చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత RCB బ్రాండ్ విలువ (Brand Value), మార్కెట్ డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో ఈ ఫ్రాంచైజీ అత్యంత విలువైన (Most Valuable) ఐపీఎల్ టీమ్‌గా మారింది.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన ప్రభుత్వం!
ముందంజలో అదార్ పూనావాలా
RCB కొనుగోలు రేసులో అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నప్పటికీ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) అధినేత అదార్ పూనావాలా ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. క్రీడా రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న పూనావాలా, టైటిల్ గెలిచిన RCB వంటి బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న జట్టును సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ భారీ డీల్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులు మరియు ఇతర ఆర్థిక అంశాలపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సంభావ్య విక్రయంపై స్పష్టమైన పెద్ద అప్‌డేట్‌లు వెలువడే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్‌లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్‌గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.