ఇరాన్‌కు సాయం చేస్తున్న రష్యా?!
కువైట్‌లో జరిగిన ఇరాన్ దాడిలో 6 మంది అమెరికా సైనికులు మరణించగా, మరికొందరు గాయపడటం గమనార్హం.
- Author : Gopichand
Date : 06-03-2026 - 9:16 IST
Published By : Hashtagu Telugu Desk
Russia: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఒక సంచలనాత్మక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు రష్యా నిఘా సమాచారాన్ని అందిస్తోందని, దీనివల్ల అమెరికా సైనిక స్థావరాలను, యుద్ధ నౌకలను, సైనిక విమానాలను ఇరాన్ సులభంగా లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ సమాచారం వల్ల అమెరికా సైనిక కదలికలను పసిగట్టడంలో, దాడులకు ప్లాన్ చేయడంలో ఇరాన్‌కు ఎంతో సహాయపడుతోంది.
‘ది వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం.. యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికా సైనిక వనరుల లొకేషన్‌కు సంబంధించిన వివరాలను రష్యా ఇరాన్‌కు చేరవేస్తోంది. ఈ విషయాన్ని ముగ్గురు అమెరికా అధికారులు గోప్యత నిబంధనతో వెల్లడించారు. రష్యా అందిస్తున్న ఈ సహాయం ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని, ఇది చాలా పెద్ద పరిణామమని ఒక అధికారి తెలిపారు.
అయితే వాషింగ్టన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఈ నివేదికపై స్పందించేందుకు నిరాకరించింది. తమ సైనిక స్థావరాల ఖచ్చితమైన స్థానాలను గుర్తించే సామర్థ్యం ఇరాన్‌కు పరిమితమని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అలాంటి తరుణంలో రష్యా వంటి అత్యున్నత సాంకేతిక నిఘా సామర్థ్యాలు కలిగిన దేశం నుండి సమాచారం అందడం ఇరాన్‌కు చాలా కీలకంగా మారింది.
వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ రష్యాపై వస్తున్న ఆరోపణలపై నేరుగా స్పందించలేదు కానీ ఇరాన్ పాలనపై సైనిక ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం, నౌకాదళం, ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటున్నాయని ఆమె తెలిపారు.
ఈ అంశంపై CIA, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇరాన్ యుద్ధంలో రష్యా, చైనాల పాత్ర గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను అడిగినప్పుడు తన వద్ద అటువంటి సమాచారం లేదని, ప్రస్తుత యుద్ధంలో వారు నిర్ణయాత్మక కారకాలు కాదని అన్నారు. అమెరికా అధికారుల అభిప్రాయం ప్రకారం.. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ చైనా ఎటువంటి సైనిక సహాయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. చైనా కూడా యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చింది.
Also Read: మార్చి 31లోపు ఈ పనులు పూర్తి చేయాల్సిందే!
రష్యా నిజంగానే నిఘా సమాచారాన్ని పంచుకుంటుంటే ఇరాన్ దాడుల ఖచ్చితత్వం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి దాడుల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, రాడార్ వంటి కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం దీనికి నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. రష్యా అంతరిక్ష, నిఘా సాంకేతికత ఇరాన్‌కు ఎంతో కీలకం. ఎందుకంటే ఇరాన్ వద్ద సొంతంగా భారీ శాటిలైట్ నెట్వర్క్ లేదు. ఈ సహకారం ఇలాగే కొనసాగితే మధ్యప్రాచ్యంలోని ఈ సంఘర్షణ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కువైట్‌లో జరిగిన ఇరాన్ దాడిలో 6 మంది అమెరికా సైనికులు మరణించగా, మరికొందరు గాయపడటం గమనార్హం. ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వేల సంఖ్యలో డ్రోన్లు, వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక ఆపరేషన్లలో ఇరాన్‌కు చెందిన 2000కు పైగా స్థావరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.