Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
- Author : Vamsi Chowdary Korata
Date : 03-11-2025 - 12:38 IST
Published By : Hashtagu Telugu Desk
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
A moment for the history books. 💙#MithaliRaj celebrates with the World Champions Team India! 🏆 pic.twitter.com/Ljn1sjYfWW
— Star Sports (@StarSportsIndia) November 2, 2025
భారత్‌లో క్రికెట్ అంటే రెండే రెండు పేర్లు గుర్తొస్తాయి. ఒకరు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, మరొకరు ది గ్రేట్ లెజండ్రీ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ . ఇండియాలో క్రికెట్ మీద ఆసక్తి పుట్టించింది ఈ ఇద్దరే. ఒకరు పురుషుల క్రికెట్‌కు ఆరాధ్యంగా నిలిస్తే, మరొకరు ఆడవాళ్లను క్రికెట్‌లోకి వచ్చేలా చేశారు. టీమిండియా మహిళా క్రికెట్‌కు కెప్టెన్‌గా చాలా కాలం కొనసాగిన మిథాలీ రాజ్ వన్డే వరల్డ్ కప్ అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. కానీ.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ కలను ఇన్నేళ్లకు నెరవేర్చింది.
ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. నాలుగు దశాబ్దాల క్రికెట్ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కి వెళ్లిన భారత జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. రెండు సార్లు ఫైనల్‌లో ఓటమి పాలయిన టీమిండియా, ఎట్టకేలక సొంతగడ్డపై ఆ కలను నెరవేర్చుకుంది.
ఐసీసీ ఛైర్మన్ జై షా చేతుల మీదుగా వన్డే వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , ఆ తర్వాత టీమిండియా ఉమెన్ లెజండ్రీ ప్లేయర్ మిథాలీ రాజ్‌కి ఆ ట్రోఫీని అందజేసింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మిథాలీ రాజ్.. మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లోకి వెళ్లింది. ప్లేయర్స్ అందరితో మాట్లాడి సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది.
హర్మన్ ప్రీత్ కౌర్ ఆ ట్రోఫీని మిథాలీకి అందజేసింది. ఆ వెంటనే ట్రోఫీని చూసి చాలా భావోద్వేగంతో మిథాలీ టీమిండియా ప్లేయర్లకు థాంక్యూ చెప్పింది. ట్రోఫీని పైకి ఎత్తాలంటూ టీమ్ మెంబర్స్ అందరూ మిథాలీని కోరారు. దాంతో మిథాలీ ఆ ట్రోఫీని ముద్దాడి పైకెత్తి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న క్రాంతి గౌడ్‌ను హత్తుకుంది. లేడీ టెండూల్కర్‌గా పేరొందిన మిథాలీ కల ఇన్నాళ్లకు నెరవేరింది.
మిథాలీ రాజ్‌తో పాటు మాజీ క్రికెటర్లు జులన్ గోస్వామీ కూడా గ్రౌండ్‌లో సంబరాలు చేసుకున్నారు. జులన్ గోస్వామి అయితే హర్మన్ ప్రీత్ కౌర్‌తో పాటు స్టెప్పులేసి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ జులన్ గోస్వామిని హత్తుకుని ఏడ్చేసింది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామీ టీమిండియా మహిళా జట్టుకు చేసిన సేవలు ఎనలేనివి!