ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
- Author : Vamsi Chowdary Korata
Date : 22-01-2026 - 4:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
- రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ
- రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగపత్రం దాఖలు చేయగా, విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా రెండు రోజుల క్రితం (ఈ నెల 20న) మాజీ మంత్రి హరీశ్ రావును అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. “ఉద్యమాలు మాకు కొత్త కాదు, మీలాగా పారిపోలేదు. ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారు” అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హరీశ్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్‌కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.