పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2026 - 5:09 IST
Published By : Hashtagu Telugu Desk
YS Jagan Announces Padayatra మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం రోజున ఏలూరు నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఎప్పటి నుంచి చేపడతాననే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర రోజులు ప్రజల్లో ఉంటానని తెలిపారు. ఇకపై ప్రతి శనివారం కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తానంటూ జగన్ ప్రకటించారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఏలూరు నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఏడాదిన్నర కాలం ప్రజల్లోనే ఉంటానన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం రోజున ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానని వైఎస్ జగన్ వెల్లడించారు. ఏలూరు నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నామన్నారు.
వచ్చే నెల లేదా మార్చిలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోందన్న వైఎస్ జగన్ .. కూటమి ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమేనన్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయవచ్చనే అహంకారంతో ఉన్నారన్న వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ వ్యవస్థ కనిపించడం లేదని ఆరోపించారు. ఆరోగ్య శ్రీని కనుమరుగు చేశారని.. 108,104 వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కూటమి పాలనలో వ్యవసాయ రంగం నాశనమైందని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్న వైఎస్ జగన్.. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని అన్నారు.
మరోవైపు 2017లోనూ వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారు. 2017లో ప్రజా సంకల్పయాత్రను ప్రారంభించిన జగన్.. 13 జిల్లాల మీదుగా 3648 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగించారు. ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాలను వింటూ సుదీర్ఘ పాదయాత్ర సాగించారు వైఎస్ జగన్. అనంతరం 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా151 సీట్లలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది.
అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని మళ్లీ నిలబెట్టాలంటే.. పాదయాత్రే మార్గమని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల సమయానికి పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.