ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, హరీష్ రావు ఫోన్ సైతం ట్యాప్ !!
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత ఫోన్లతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిఘా నీడలో ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
- Author : Sudheer
Date : 21-01-2026 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ (SIT) అధికారులు విచారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విచారణ సందర్భంగా పోలీసులు వెల్లడించిన విషయాలు హరీశ్ రావును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్లు సమాచారం. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత ఫోన్లతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిఘా నీడలో ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

Sit Enquiry Harish Rao
ఈ విచారణలో భాగంగా పోలీసులు హరీశ్ రావుకు కొన్ని కీలకమైన సాంకేతిక ఆధారాలను చూపినట్లు సమాచారం. “మీ ఫోన్ ట్యాప్ అయిందని మీకు తెలుసా?” అని అధికారులు ప్రశ్నించగా, హరీశ్ రావు మొదట నమ్మలేకపోయారని, “ఇవి మీరు సృష్టించిన ఆధారాలా?” అని ఎదురు ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఏయే తేదీల్లో ఫోన్ కాల్స్ రికార్డ్ అయ్యాయి, ఏ ప్రాంతాల నుండి సిగ్నల్స్ ట్రాక్ చేశారో పోలీసులు వివరించడంతో ఆయన షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. సొంత ప్రభుత్వ హయాంలోనే తనపై నిఘా పెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అప్పటి అధికార పార్టీలోని కీలక నేతలను కూడా లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. సిట్ అధికారులు సేకరించిన ఈ ఆధారాలు నిజమని తేలితే, ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై హరీశ్ రావు బహిరంగంగా స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తిస్థాయి విచారణ పూర్తయితే తప్ప ఈ అంశంపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేలా లేదు.