మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గట్టి సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 10 శాతం సీట్లు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు
- Author : Sudheer
Date : 22-01-2026 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గట్టి సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 10 శాతం సీట్లు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో ఎంతో చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని ఆయన విమర్శించారు.

Ktr
గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ఉటంకిస్తూ మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం బీఆర్ఎస్ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే, పైసా ఖర్చు పెట్టకుండా మూడు పార్లమెంట్ స్థానాల్లో గెలిచామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలైన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాల్లోనూ ఓడిపోవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోందని ఆయన విశ్లేషించారు.
అంతేకాకుండా, రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం అనేది ఒక పెద్ద “జోక్” అని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, బీఆర్ఎస్ నేతలు కేవలం కార్యకర్తలను కాపాడుకోవడానికే ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.