బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2026 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- సింగరేణిపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నమంత్రి
- హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చ పెడితే బహిష్కరించి వెళ్లిపోయారన్న మంత్రి
గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లను అప్పగించిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు ఇప్పుడు వారికి చెడ్డవారయ్యారా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై కూడా బీఆర్ఎస్ నాయకులు ఇలాగే ఆరోపణలు చేశారని, అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇస్తే బహిష్కరించి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు.