IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్ చేయనున్న పంత్.. ప్రారంభ ధరే రూ. 20 కోట్లు?
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కు ఎక్కువ డబ్బుతో రానుంది. ఈ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వారి పర్స్‌లో రూ. 110.5 కోట్లు ఉన్నాయి.
- By Gopichand Published Date - 11:49 PM, Sat - 2 November 24

IPL Mega Auction 2025: ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో (IPL Mega Auction 2025) పలువురు పెద్ద ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. మెగా వేలంలో ఈసారి ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది. ఎందుకంటే చాలా ఫ్రాంచైజీలు ఈసారి తమ స్టార్ ఆటగాళ్లను విడుదల చేశాయి. ఇందులో చాలా మంది కెప్టెన్లు కూడా ఉన్నారు. ఈసారి వేలంలో రికార్డులను బద్దలు కొట్టగల ఆటగాడు ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈసారి వేలంలో రికార్డులు సృష్టించగలడని నమ్ముతున్నారు. ఇప్పటివరకు పంత్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా కనిపించాడు. కాని ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేయడంతో అన్ని జట్ల చూపు రిషబ్ పంత్ పైనే పడనుంది.
పంత్‌పై కాసుల వర్షం కురవనుందా?
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కు ఎక్కువ డబ్బుతో రానుంది. ఈ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వారి పర్స్‌లో రూ. 110.5 కోట్లు ఉన్నాయి. ఈ జట్టుతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.83 కోట్లు మిగిలాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు తమ తమ కెప్టెన్లను కూడా విడుదల చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అవసరం. ఈ రెండు జట్లూ మెగా వేలంలో పంత్ కోసం పోటీ పడవచ్చు.
Also Read: IPL 2025: కేఎల్ రాహుల్ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు.. ఎవరంటే?
పంత్ రికార్డులను బద్దలు కొట్టగలడా?
రిషబ్ పంత్ ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో భాగం కాబోతున్నాడు. నివేదిక ప్రకారం.. వేలంలో పంత్ అసలు బిడ్ 20 కోట్ల రూపాయల నుండి ప్రారంభమవుతుందని సమాచారం. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ ఆటగాడి కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
గతేడాది వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. 24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈసారి పంత్ ఈ సంఖ్యను కూడా దాటగలడని భావిస్తున్నారు. అయితే వేలంలో పంత్ కొత్త రికార్డును సృష్టించగలడా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.