YSRCP : వైఎస్సార్‌సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
- By Kavya Krishna Published Date - 10:35 AM, Wed - 20 November 24

YSRCP : గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలను చేపట్టినట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
2019లో టీడీపీ నుంచి వైసీపీలో చేరి, చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి విజయం సాధించిన విడదల రజనీ, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆమె విజయానంతరం నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయాయి – మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక వర్గం కాగా, రజనీ మరో వర్గంగా నిలిచారు.
PDS లీకేజీ శాతంలో తెలంగాణ రికార్డు – మంత్రి ఉత్తమ్ అభినందనలు
ఈ విభేదాల నేపథ్యంలో, జగన్ రజనీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించారు. 2024 ఎన్నికల ముందు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్పు చేశారు. అయితే, ఇక్కడ ఆమె ఓటమి చవిచూశారు. ఇక చిలకలూరిపేటలో కూడా వైసీపీ అభ్యర్థి మనోహర్ నాయుడు ఓడిపోయారు. ఈ క్రమంలో పార్టీ తిరిగి రజనీని చిలకలూరిపేటకు ఇన్‌చార్జ్‌గా నియమించింది. కాపు సామాజిక వర్గంలో ఆమెకు మంచి పట్టుండటం, కుటుంబానికి విశ్వసనీయత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వైసీపీ డైమండ్ బాబును నియమించింది. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన సుచరిత రాజకీయాల్లో కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో ఈ మార్పు జరిగింది. సుచరిత భర్త దయాసాగర్‌కు ఈ పదవి అప్పగించమని చేసిన విజ్ఞప్తికి స్పందించలేదన్న ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో గతంలో పద్మశాలీ వర్గానికి చెందిన లావణ్యను పోటీకి దింపగా ఆమె ఓడిపోయారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమారెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బాధ్యతలు ఎవరికప్పగిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆ బాధ్యతలు తనకు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా అధ్యక్షుడైన అంబటి రాంబాబుకు ఈ నియోజకవర్గం అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా, గుంటూరు జిల్లాలో వైసీపీ చర్చలు, నిర్ణయాలు రాజకీయంగా రసవత్తరంగా మారాయి.
Kiara Advani : 2025 కియరా అద్వాని.. మోత మోగించేస్తుందా..?