YSRCP : కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే – సజ్జల
- Author : Prasad
Date : 02-06-2026 - 1:04 IST
Published By : Hashtagu Telugu Desk
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలేనని ఆరోపించారు వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. దగా, మోసం, వెన్నుపోటుకి పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య హాజరైయ్యారు. ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసేసి, మహిళలకు పెద్దపీట వేశానని.. 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి సామ్రాజ్యాధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఆయనే అన్నారు. మహిళా విభాగం ద్వారా ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను రాష్ట్ర మహిళలకు గుర్తుచేసి, వాస్తవాలను గణాంకాలతో సహా వివరించడంతోపాటు మేమున్నామనే భరోసా ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటున్న లోకేష్ కి చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో ఇవ్వొచ్చు కదా అని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్సార్సీపీ మహిళా నాయకులు పాల్గొని ప్రసంగించారు.