Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 12:09 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే (TVK) పార్టీకి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అనుమతి మంజూరు చేశారు. రాజ్‌భవన్‌లో తనను కలిసిన టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు గవర్నర్ ఈ మేరకు అధికారిక సమాచారాన్ని అందించారట. అయితే గవర్నర్ నిర్ణయంపై లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. కాగా, విజయ్ ఈరోజే సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యాంగపరమైన సంప్రదాయాలను అనుసరించి, అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీల బలాన్ని కలిపి చూస్తే ప్రస్తుతం విజయ్ వద్ద 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి టీవీకేకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం.
గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తన అధికారాలను ఉపయోగించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్‌కు నిర్ణీత గడువును విధించారు. ఈ గడువు ముగిసేలోపు విజయ్ మరో ఆరుగురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని, మొత్తం 118 మంది సభ్యుల మద్దతును సభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బలపరీక్షలో విజయ్ విజయం సాధిస్తే, తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీ నూతన శకాన్ని ప్రారంభించినట్లవుతుంది… చరిత్రలో నిలిచిపోతుంది.