Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్‌లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
- By Gopichand Published Date - 11:40 AM, Tue - 10 December 24

Death In Pushpa-2 Theatre: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పరిధిలోని రాయదుర్గం పట్టణంలో పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో ఓ ప్రేక్షకుడు అనుమానాస్పద స్థితిలో మృతి (Death In Pushpa-2 Theatre) చెందాడు. బంధువులు, స్థానికుల వివరాల మేరకు.. రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది. అప్పటికే ఓ వ్యక్తి సీట్లో నిద్రపోతున్నాడని గుర్తించిన కొందరు యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వారు అతణ్ని బయటకు తీసుకువచ్చి ప్రేక్షకులను లోపలికి వదిలారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు గుర్తించిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రాత్రి 7.30 సమయంలో పోలీసులు బంధువులకు విషయం చేరవేశారు. కుటుంబీకులు థియేటర్ వద్దకు చేరుకొని రోధించారు. మృతదేహాన్ని తరలించించేందుకు ప్రయత్నించగా తమకు న్యాయం జరిగే వరకు కదలనీయమని అడ్డుకున్నారు. దాంతో సినిమాను అర్ధాంతరంగా ఆపేసి అందరినీ బయటకు పంపారు. మద్దానప్ప కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
Also Read: Ishan Kishan: ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించింది ఈరోజే.. వేగవంతమైన డబుల్ సెంచరీ చేసి!
బంధువులు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ జయనాయక్ సిబ్బందితో కలసి జాగ్రత్తలు తీసుకున్నారు. థియేటర్ యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.
మరోవైపు పుష్ప-2 విడుదల రోజు నుంచే వివాదాల మధ్య నడుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో చూడటానికి అల్లు అర్జున్ వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే వివాహిత మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి కాస్త ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. రేవతి మృతికి అల్లు అర్జున్ స్వయంగా రూ. 25 లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే శ్రీతేజ చికిత్స ఖర్చులు కూడా తానే భరిస్తాను అని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.