బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై
- Author : Vamsi Chowdary Korata
Date : 26-01-2026 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
China Husband Divorces Sick Wife For Losing Hair చైనాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు అనారోగ్యం కారణంగా బట్టతల రావడంతో ఓ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వివాహ బంధాన్ని అర్థాంతరంగా తెంచేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది.
- చర్మవ్యాధి కారణంగా జుట్టు కోల్పోయిన మహిళ
- బిడ్డ కస్టడీని కూడా దక్కకుండా చేసిన భర్తపై విమర్శలు
- చైనాలో దారుణం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు
- చికిత్సకు నిరాకరించి, మానసికంగా వేధించిన భర్త
హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ (36) అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కుటుంబమే లోకంగా బతికింది. భర్త, పిల్లల కోసం అహర్నిశలు శ్రమించింది. అయితే, రెండేళ్ల క్రితం ఆమెకు ‘విటిలిగో’ అనే దీర్ఘకాలిక చర్మ వ్యాధి సోకింది. దీనివల్ల ఆమె జుట్టు తెల్లబడి, క్రమంగా ఊడిపోయి బట్టతల వచ్చింది.
అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు అండగా నిలవాల్సిన భర్త.. ఆమెను అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లడం గానీ, ఆరోగ్యం గురించి అడగడం గానీ చేయలేదు. తన పరువు పోతుందని భావించి శుభకార్యాలకు కూడా ఆమెను దూరం పెట్టాడు. చికిత్సకు అయ్యే ఖర్చు భరించడం ఇష్టంలేక ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు.
భర్త నిర్లక్ష్యం, నిత్యం గొడవలతో లీ మానసికంగా కుంగిపోయింది. ఈ ఒత్తిడి కారణంగా ఆమె వ్యాధి మరింత తీవ్రమైందని వైద్యులు తెలిపారు. చివరికి, ఆమె భర్త విడాకులు కోరగా, లీ అంగీకరించక తప్పలేదు. కోర్టు కూడా బిడ్డ కస్టడీని భర్తకే అప్పగించడంతో ఆమె ఒంటరైపోయింది. “అతనిలాంటి కఠిన హృదయుడిని నేనెక్కడా చూడలేదు” అని లీ కన్నీరుమున్నీరైంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆ భర్త తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.