Virat Kohli: రంజీ ట్రోఫీకి విరాట్ కోహ్లీ డుమ్మా.. బీసీసీఐ చర్యలు?
రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.
- By Gopichand Published Date - 09:06 AM, Wed - 15 January 25

Virat Kohli: జనవరి 22 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ సిరీస్ నుంచి శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌లకు విశ్రాంతి లభించింది. ఇదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత BCCI ఆటగాళ్ల పట్ల కొంచెం కఠినంగా ఉంది. ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ కోసం ఢిల్లీ సంభావ్య జట్టులో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు కూడా ఉన్నాయి. అయితే రంజీల్లో ఆడేందుకు కోహ్లీ (Virat Kohli) ఇంకా డీడీసీఏకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
విరాట్ రంజీ ఆడకుండా ఉంటాడా?
ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఢిల్లీ పిలుపుపై విరాట్ స్పందించలేదు. జనవరి 23, 30 తేదీల్లో సౌరాష్ట్ర, రైల్వేస్‌తో జరిగే మిగిలిన రెండు రంజీ మ్యాచ్‌లకు ఢిల్లీ సంభావ్య జట్టును ప్రకటించింది. ఇందులో కోహ్లీ పేరు కూడా ఉంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ శిబిరం కొనసాగుతోంది. అయితే కోహ్లీ త్వరలో క్యాంప్‌లో చేరతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆ ఓటర్లు ఎటువైపు?
ఆస్ట్రేలియాతో ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని కోహ్లీకి నిరంతరం సలహాలు ఇస్తున్నారు. మరి కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడకపోతే బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. విరాట్ కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్ 2012లో ఆడాడు. విరాట్ కోహ్లీ గురించి.. DDCA సెక్రటరీ అశోక్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సమాచారం గురించి ఇంకా ఏం చెప్పలేదని ఆయన అన్నారు.
రిషబ్ పంత్ రంజీ ఆడనున్నాడు
రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు. జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ కోసం రిషబ్ పంత్ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సెక్రటరీ అశోక్ శర్మ ధృవీకరించారు. రిషబ్ పంత్ చివరిసారిగా డిసెంబర్ 2017లో 2017-18 ఫైనల్‌లో విదర్భతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ ప్రస్తుతం 14 పాయింట్లతో ఎలైట్ గ్రూప్-డిలో మూడో స్థానంలో ఉంది.