బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!
బీసీసీఐ నమన్ అవార్డులు 2006-07లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లను ఇందులో సత్కరిస్తారు.
- Author : Gopichand
Date : 14-03-2026 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI Naman Awards 2026: భారత క్రికెట్ నియంత్రణ మండలి శుభ్‌మన్ గిల్‌ను ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో గౌరవించనుంది. శనివారం బీసీసీఐ విడుదల చేసిన నమన్ అవార్డ్స్ 2026 జాబితాలో గిల్‌కు మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం, స్మృతి మంధానకు ‘బెస్ట్ విమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించాయి. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం, మార్చి 15న జరగనుంది.
బీసీసీఐ నమన్ అవార్డులు 2006-07లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లను ఇందులో సత్కరిస్తారు. పురుషుల విభాగంలో ఇచ్చే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును పాలీ ఉమ్రీగర్ అవార్డు అని కూడా పిలుస్తారు.
Also Read: గౌతమ్ గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన గంగూలీ!
శుభ్‌మన్ గిల్ రికార్డులు
ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ పాలీ ఉమ్రీగర్ అవార్డును అందుకోవడం ఇది రెండవసారి. 2025లో గిల్ 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో 983 పరుగులు చేశారు. గత ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 754 పరుగులు సాధించి అదరగొట్టాడు. గత ఏడాది 11 వన్డేల్లో 490 పరుగులు చేశాడు.
స్మృతి మంధాన ఘనత
మరోవైపు స్మృతి మంధాన వరుసగా రెండో ఏడాది ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును అందుకోనున్నారు. మొత్తంగా మంధాన ఈ గౌరవాన్ని అందుకోవడం ఇది ఐదవసారి.
టీ20 వరల్డ్ కప్‌కు గిల్ దూరం
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టు నుండి తొలగించిన సంగతి తెలిసిందే. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో ఆయనను జట్టులోకి తీసుకోలేదు. 2025 ప్రారంభం నుండి టీ20ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో గిల్ విఫలమయ్యాడు. దీని ఫలితంగా గిల్ వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. కాగా టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.