RCB: ఆర్సీబీపై ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కన్ను!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే సీజన్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు గత సీజన్లో 18 సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి IPL టైటిల్‌ను గెలుచుకుంది.
- By Gopichand Published Date - 08:15 PM, Mon - 17 November 25
RCB: IPL 19వ సీజన్‌కు సంబంధించిన మినీ వేలంకు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు సంబంధించి ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. ‘కాంతారా’ సినిమా నిర్మాతలు RCB ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపారు. హోంబెల్ ఫిల్మ్స్ (Hombale Films) ‘కాంతారా’తో పాటు KGF, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించింది. RCBలో వాటాను కొనుగోలు చేయడానికి హోంబెల్ ఫిల్మ్స్, RCB ప్రస్తుత యజమాని అయిన డియాగో ఇండియా మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ రెండు కంపెనీల మధ్య డీల్ IPL 2026కు ముందే ఖరారు కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. RCBని కొనుగోలు చేయడానికి పలు పెద్ద కంపెనీలు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్న సమయంలో ఈ వార్త బయటకు వచ్చింది. అయితే RCBని కొనుగోలు చేయడానికి డియాగో ఇండియాతో అధికారికంగా ఎవరు చర్చలు జరిపారు అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
Also Read: Smriti Mandhana: ఈనెల 23న టీమిండియా ఓపెనర్ పెళ్లి.. హాజరుకానున్న రోహిత్, కోహ్లీ!
RCB, హోంబెలే గతంలో కలిసి పని చేశాయి
ఈ రెండు సంస్థలు గతంలో కూడా కలిసి పని చేశాయని నివేదికలు చెబుతున్నాయి. హోంబెలే ఫిల్మ్స్ 2023 నుండి RCBకి అధికారిక డిజిటల్ భాగస్వామిగా ఉంది. ఈ సంస్థ జట్టు కోసం అనేక ఎంగేజ్మెంట్ ప్రచారాలను నిర్వహించింది, క్రియేటివ్ ప్రొమోలు, సినిమాటిక్ మ్యాచ్ టీజర్లను రూపొందించింది. ఇప్పుడు ఈ సంస్థ RCBలో వాటాను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది.
ఆసక్తి చూపుతున్న ప్రముఖులు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. గౌతమ్ అదానీ, దేవయాని ఇంటర్నేషనల్, జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, సీరం ఇన్స్టిట్యూట్ యజమాని అదార్ పూనావాలా కూడా తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే RCBకి అధికారికంగా ఎవరు ప్రతిపాదన పంపారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే సీజన్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు గత సీజన్లో 18 సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఛాంపియన్ అయిన తర్వాత, డియాగో ఇండియా ఈ జట్టు విలువను సుమారు రూ. 17,000 కోట్లుగా అంచనా వేసి, జట్టులో తమ వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది.