వరల్డ్ కప్‌కు తిలక్ వర్మ డౌట్ ?
- Author : Vamsi Chowdary Korata
Date : 10-01-2026 - 5:29 IST
Published By : Hashtagu Telugu Desk
Tilak Varma గతేడాది ఆసియా కప్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లోనూ.. తిలక్ వర్మ తొలి ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి.
- సర్జరీతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం
- టీ20 వరల్డ్ కప్‌లోనూ అందుబాటులో ఉండడని అనుమానాలు
- అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సర్వత్రా చర్చ
ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ తిలక్ వర్మ.. గాయంతో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. జనవరి 21 నుంచి నాగ్‌పూర్ వేదికగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే మూడు మ్యాచ్‌లే కాకుండా.. మొత్తం సిరీస్‌లో కూడా తిలక్ వర్మ అందుబాటులో ఉండడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరోవార్త క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గరి చేస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లోనూ ప్రారంభంలో జరిగే ఒకట్రెండు మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమవుతాడనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో తిలక్ వర్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.
గతేడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ తిలక్ ఆకట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా వృషణాల శస్త్రచికిత్స (testicular torsion) తర్వాత జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు అతడి లభ్యతను.. వైద్య బృందం పర్యవేక్షణ ఆధారంగా నిర్ణయిస్తామని బీసీసీఐ చెప్పింది. ఇది ఒకరకంగా టీమిండియాకు దెబ్బే. దీంతో అతడి స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
తిలక్ వర్మ ప్లేస్‌లో ఎవరు?
ఫామ్ మీద విమర్శలతో శుభ్‌మన్ గిల్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్ సిరీస్‌కూ అతడిని తీసుకోలేదు. దీంతో గిల్‌ను తిరిగి టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారా అన్నది సందేహమే. ఇక యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు కూడా చర్చకు వస్తోంది. అయితే టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మకు తోడుగా.. సంజు శాంసన్ ఓపెనర్‌గా ఖరారయ్యాడు. ఈ నేపథ్యంలో యశస్విని కూడా జట్టులోకి ఎంపిక చేస్తారా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిలక్ స్థానంలో మిడిలార్డర్లో ఆడే బ్యాటర్ అవసరం కాబట్టి.. ఇతడిని సరైన రిప్లేస్‌మెంట్ అవుతాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్టు ఉంది. వన్డేల్లో కూడా బాగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేసిన అయ్యర్.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.