IND vs ENG 5th Test: చెలరేగిన కుల్దీప్..హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 218 పరుగులకు కట్టడి చేశారు
- By Praveen Aluthuru Published Date - 06:23 PM, Thu - 7 March 24

IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 218 పరుగులకు కట్టడి చేశారు. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా, అశ్విన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. 64 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. బెన్ డకెట్ 27 పరుగుల తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో డకెట్ వెనుదిరిగాడు.ఆ వెంటనే ఓలీ పోప్ (11) పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. ఇంగ్లీష్ బ్యాటర్లలో నిలబడిన జాక్ క్రాలీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే అర్ధసెంచరీని సెంచరీ వైపు తీసుకెళ్తున్న క్రమంలో 79 పరుగుల వద్ద క్రాలీని కుల్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక 29 పరుగుల వద్ద బెయిర్‌స్టోను అవుట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది. 26 పరుగుల వద్ద అనుభవజ్ఞుడైన జో రూట్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.
కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. స్టోక్స్ కుల్దీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 24 పరుగుల వద్ద జేమ్స్ ఫాక్స్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. టామ్ హార్ట్లీ(6), మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ అశ్విన్ చేతికి చిక్కారు. ఫలితంగా ఇంగ్లాండ్ తొలిరోజు 57.04 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు, శుభ్‌మన్ గిల్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. యశస్వి జైస్వాల్ 57 పరుగులతో సత్తా చాటాడు.
Also Read: Gummadikaya Vadiyalu: బూడిద గుమ్మడికాయతో వడియాలు ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు!