BCCI Cash Prize: టీమిండియాకు భారీ నజరానా.. రూ. 58 కోట్లు ప్రకటించిన బీసీసీఐ!
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
- Author : Gopichand
Date : 20-03-2025 - 12:06 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI Announces Cash Prize: న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఆటగాళ్లు టైటిల్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలిచిన భారత జట్టు కోసం BCCI భారీ నజరానా (BCCI Announces Cash Prize) ప్రకటించింది.
రూ.58 కోట్లు ప్రకటించారు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఛాంపియన్‌గా మారటంతో ఆటగాళ్లకు రూ.58 కోట్ల నగదు బహుమతిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఆటగాళ్లు, కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్ మరియు సెలక్షన్ కమిటీ సభ్యులను సత్కరించేందుకు ఈ ప్రైజ్ మనీని ప్రకటించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు కోచ్ గౌతం గంభీర్.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు చాలా బాగా ఆడింది. మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క ప్రత్యర్థి జట్టు కూడా టీమిండియా ముందు నిలబడలేకపోయింది. ఫైనల్‌తో సహా మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. టీం ఇండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఓడించింది. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. దీని తర్వాత సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
Also Read: Overthinking: అతిగా ఆలోచించడం కూడా ఒక సమస్యేనా? దీన్ని ఎలా అధిగమించాలి?
మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను భారత్ మూడోసారి గెలుచుకుంది. గతంలో సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్ 2002 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయిన కారణంగా శ్రీలంకతో కలిసి టీమ్ ఇండియా జాయింట్ విజేతగా నిలిచింది. దీని తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్, ఇంగ్లండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం 243 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి చెరో 8 వికెట్లు తీశారు.