తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 12-03-2026 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
Rajendra Prasad తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR)ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు, నిర్మాత విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… అలనాటి తెలుగు నటుడు కాంతారావు గొప్పతనాన్ని కొనియాడారు. ఈ క్రమంలో ఆయన కాంతారావు స్థాయిని తెలియజేయడానికి, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌ను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.
ఈ విషయంపై నటుడు విశాల్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు. రాజేంద్రప్రసాద్‌ను ఉద్దేశించి ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. “తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధ కలిగింది. కాంతారావు గారిని ప్రశంసించడం మంచి విషయమే. కానీ, దానికోసం మరో దిగ్గజ నటుడు ఎంజీఆర్ గారిని కించపరచడం సరికాదు” అని విశాల్ పేర్కొన్నారు.
“ఎంజీఆర్ గారు కేవలం ఒక లెజెండరీ నటుడు మాత్రమే కాదు, తమిళనాడుకు గొప్ప నాయకుడు కూడా. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. మీ వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వివాదానికి మీరు ముగింపు పలకాలని కోరుతున్నాను” అని విశాల్ అన్నారు.
“ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పాలని నేను అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో మీ స్థాయి నటుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, ఒక నటుడిగా నేను కూడా ఇదే విధంగా స్పందిస్తాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ విశాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు, తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజేంద్రప్రసాద్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.