ఐపీఎల్ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్!
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్‌కు పంపేందుకు కూడా నిరాకరించింది.
- Author : Gopichand
Date : 05-01-2026 - 2:41 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh Government: బంగ్లాదేశ్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను బంగ్లాదేశ్‌లో ప్రసారం చేయకుండా నిషేధం విధించింది. దీనికి ప్రధాన కారణం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలని బీసీసీఐ ఆదేశించడమే. BCCI మాటను గౌరవిస్తూ KKR అతడిని జట్టు నుండి తొలగించింది. ఈ పరిణామం వివాదానికి దారితీసి అది కాస్తా ముదిరింది. దీనివల్ల ఇకపై బంగ్లాదేశ్ అభిమానులు ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లను చూడలేరు.
బంగ్లాదేశ్ క్రీడల మంత్రి ఆసిఫ్ నజ్రుల్.. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను KKR విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో IPL ప్రసారాలను నిలిపివేస్తామని ఆయన గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: నా అన్వేష్ పై మరోసారి పంజాగుట్ట PSలో కరాటే కళ్యాణి ఫిర్యాదు
బంగ్లాదేశ్ ప్రభుత్వం తన ప్రకటనలో ఈ విధంగా పేర్కొంది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను IPL 2026 నుండి KKR తప్పించింది. భారత క్రికెట్ బోర్డు (BCCI) తీసుకున్న ఈ నిర్ణయానికి సరైన కారణం లేదు. ఇది బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటీసు ఇచ్చే వరకు IPL మ్యాచ్‌లు, కార్యక్రమాల ప్రసారాలను నిలిపివేస్తున్నాము. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అథారిటీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నాము అని తెలిపింది.
భారత్‌లో టీ20 వరల్డ్ కప్ ఆడని బంగ్లాదేశ్ టీమ్
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్‌కు పంపేందుకు కూడా నిరాకరించింది. నిజానికి 2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఆడే లీగ్ మ్యాచ్‌లు కోల్‌కతా మరియు ముంబైలలో జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ భద్రతా కారణాల దృష్ట్యా తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చే ప్రక్రియను ICC ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.