Gold Prices: అలర్ట్.. ఏప్రిల్ 2 నుండి పెరగనున్న బంగారం ధరలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించనున్నారు.
- By Gopichand Published Date - 04:01 PM, Sat - 22 March 25

Gold Prices: ప్రస్తుతం బంగారం ధరలు (Gold Prices) హెచ్చుతగ్గులు లేకుండా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు దాదాపు రూ. 440 తగ్గింది. అయితే ఈ తగ్గుదల ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. మరికొద్ది రోజుల్లో బంగారం ధర మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఏప్రిల్ 2 నుండి దీని ధరలలో పెద్ద పెరుగుదల కూడా సాధ్యమే అంటున్నారు మార్కెట్ నిపుణులు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించనున్నారు. ఇది మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో బంగారంపై పెట్టుబడి పెరుగుతుంది. ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంగారం ధరలు వేగంగా పెరిగాయి. టారిఫ్ విధానాలు, స్టాక్ మార్కెట్‌తో సహా ఇతర పెట్టుబడి ఎంపికల బలహీనమైన పనితీరు కారణంగా బంగారంపై పెట్టుబడి పెరిగింది. డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగినప్పుడు ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. బంగారం విషయంలోనూ అదే జరిగింది.
వాణిజ్య యుద్ధం భయం
ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకం అమల్లోకి రానుండగా.. వాణిజ్య యుద్ధం ముదురుతుందనే భయం మళ్లీ తెరపైకి వచ్చి బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో దీని ధరలు మళ్లీ రాకెట్ వేగం పుంజుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటీవల గ్లోబల్ ఫండ్ మేనేజర్‌ల మధ్య ఒక సర్వే నిర్వహించింది. అందులో వారు వాణిజ్య యుద్ధం పెద్ద ఎత్తున ప్రారంభమైతే, బంగారం ఉత్తమ పనితీరు గల ఆస్తిగా మారుతుందని చెప్పారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వ్యూహకర్త లూయిస్ స్ట్రీట్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై సుంకాల సంభావ్య ప్రభావం బంగారం బలాన్ని పెంచింది.
Also Read: New Super Over Rules: సూపర్ ఓవర్‌కు సంబంధించి కొత్త రూల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్!
భారతదేశంలో బంగారం ధర గురించి మాట్లాడుకుంటే ఈ రోజు (22 మార్చి) తగ్గింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.89,780కి చేరింది. కాగా శుక్రవారం దీని ధర రూ.90,220. అంటే బంగారం ధర రూ.440 తగ్గింది. అదే సమయంలో వెండి ధర కూడా దాదాపు 2 వేల రూపాయలు తగ్గింది. నిన్న కిలో రూ.1,03,000 ధరకు లభించగా, నేడు కిలో రూ.1,01,000గా ఉంది. అందువల్ల బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టే వారికి ఈరోజు మంచి అవకాశం.
దేశంలో బంగారం ధరలు డిమాండ్, సరఫరాపై మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యకలాపాలు కూడా వాటిని ప్రభావితం చేస్తాయి. లండన్ OTC స్పాట్ మార్కెట్, COMEX గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో సహా ప్రధాన గ్లోబల్ మార్కెట్‌లలో ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా బంగారం ధరలు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. ఇది బంగారం ధరను US డాలర్లలో ప్రచురిస్తుంది. ఇది బ్యాంకర్లు, బులియన్ వ్యాపారులకు ప్రపంచ ప్రమాణంగా పనిచేస్తుంది. అదే సమయంలో మన దేశంలో భారతీయ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారం అంతర్జాతీయ ధరలకు దిగుమతి సుంకం, ఇతర పన్నులను జోడించడం ద్వారా రిటైలర్లకు బంగారాన్ని ఇచ్చే రేటును నిర్ణయిస్తుంది.