APs Development: ఏపీ అభివృద్ధికి ఆటంకం.. రాష్ట్రానికి పెట్టుబడులపై వైసీపీ కుట్రలు!
రూ. 90 వేల కోట్ల టర్నోవర్‌తో బిజినెస్ చేసే RJ Corp గ్రూప్ కేవలం 37 ఎకరాల భూమి కోసమే వోల్ట్‌సన్ అనే సంస్థను స్థాపించిందనే వైసీపీ ఆరోపణలు అర్థం పర్థం లేనివని అధికార పక్షం కొట్టిపారేసింది.
- By Gopichand Published Date - 09:55 PM, Mon - 17 November 25
APs Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని (APs Development) అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చేస్తున్న కుట్రలు, రాజకీయ బురద జల్లుడు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న అంతర్జాతీయ సంస్థలపై నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తూ.. అభివృద్ధి నిరోధక వైఖరిని వైసీపీ ప్రదర్శిస్తోందని పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి.
తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన ప్రముఖ సంస్థ వోల్ట్‌సన్ ల్యాబ్స్‌పై వైసీపీ అడ్డగోలు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కియా, గూగుల్ వంటి సంస్థలకు ఇచ్చిన రాయితీల విషయంలోనూ జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా ఆరోపణలు చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని అధికార పక్షం గుర్తుచేస్తోంది.
వోల్ట్‌సన్ ల్యాబ్స్ వెనుక ఉన్న RJ Corp గ్రూప్ శక్తి
వోల్ట్‌సన్ ల్యాబ్స్ అనేది కేవలం భూముల కోసమో ఇతర అవసరాల కోసమో స్థాపించిన అల్లాటప్పా సంస్థ కాదనేది వాస్తవం. వోల్ట్‌సన్ ల్యాబ్స్ వెనుక రూ. 90,000 కోట్లకు పైబడిన టర్నోవర్‌తో రవి జైపురియా నేతృత్వంలో పనిచేస్తున్న RJ Corp గ్రూప్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలతో పాటు, పెప్సీకో బాట్లింగ్ భాగస్వామిగా కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కోస్టా కాఫీ వంటి ప్రముఖ QSR బ్రాండ్‌ల ఫ్రాంచైజీగా ఈ గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ (VBL), దేవయాని ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఈ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలు. ఇండియా సహా దుబాయ్, థాయ్‌లాండ్, మొరాకో వంటి దేశాల్లో RJ Corp గ్రూప్ తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ గ్రూప్‌కు ఉన్న ఆర్థిక స్థిరత్వం, పేరు అపారమైనది.
Also Read: Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు నయా ఫార్ములా?!
గ్రీన్ ఎనర్జీపై ఏపీ ప్రభుత్వం నమ్మకం
ఇలాంటి మంచి పేరున్న RJ Corp గ్రూప్ ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టింది. గ్లోబల్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రీన్ ఎనర్జీ రంగానికి భారత్‌తో సహా ఏపీ ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మెరుగైన పాలసీలను రూపొందించి, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ఈ రంగంలోని సంస్థలను ఆకర్షిస్తోంది.
తిరుపతిలో భారీ పెట్టుబడి
RJ Corp గ్రూప్‌లో భాగమైన వోల్ట్‌సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి జిల్లా నాయుడుపేట ఏంపీఎస్‌ఈసీలో రూ. 1,743 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ సౌర సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నవంబర్ 15న G.O. Ms. No. 222 జీవోను జారీ చేసింది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగా ప్రాజెక్టు వేగంగా ప్రారంభం కావడానికి, అత్యాధునిక టాప్‌కాన్ మోనోక్రిస్టలైన్ టెక్నాలజీని ఉపయోగించే ఈ ప్రాజెక్టుకు రాయితీలు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 415 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.
అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు
రూ. 90 వేల కోట్ల టర్నోవర్‌తో బిజినెస్ చేసే RJ Corp గ్రూప్ కేవలం 37 ఎకరాల భూమి కోసమే వోల్ట్‌సన్ అనే సంస్థను స్థాపించిందనే వైసీపీ ఆరోపణలు అర్థం పర్థం లేనివని అధికార పక్షం కొట్టిపారేసింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక క్లీన్‌టెక్ క్లస్టర్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంటే, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మండిపడింది. “రాష్ట్రంలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎలా పని చేస్తారో చూస్తా.. రాజధానిలో పెట్టుబడులు పెడితే వారిని తరమికొడతానన్న జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇంతకు మించి ఆశించలేం” అని కూటమి ప్రభుత్వం పేర్కొంది.