CM Chandrababu: శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
యూరియా కొరతపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 09:25 PM, Tue - 16 September 25

CM Chandrababu: ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ యంత్రాంగానికి కీలక దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లను ఉపయోగించి అత్యుత్తమ పనితీరు కనబరచాలని, నేరాలను అదుపు చేయాలని ఆయన సూచించారు.
దుష్ప్రచారాలపై నిఘా అవసరం
యూరియా కొరతపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమెరికా నుంచి 750కి పైగా తప్పుడు పోస్టులు పెట్టి రైతులు-ప్రభుత్వం మధ్య వివాదం సృష్టించేందుకు యత్నించారని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలపై ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ద్వారా ఎప్పటికప్పుడు విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
క్రైమ్ రేట్‌పై ఆందోళన
గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో క్రైమ్ రేట్ 4 శాతం, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, సైబర్ నేరగాళ్ల కంటే పోలీసులు మరింత అధునాతనంగా మారాలని సూచించారు. నెలకు రూ. 30 కోట్ల మేర సైబర్ నేరాల ద్వారా ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో డాగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: Super 4 Contest: ఉత్కంఠభరితంగా ఆసియా కప్.. టేబుల్ టాపర్స్ ఎవరంటే?
మత్తు పదార్థాలపై కఠిన వైఖరి
డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని, రవాణాను పూర్తిగా అరికట్టేలా నిఘా పెంచాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
కొత్త దర్యాప్తు, పాత కేసుల పునరుద్ధరణ
శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, నేరాలను 50 శాతం తగ్గించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. క్రిమినల్స్‌లో భయం కలిగించడానికి కొందరిని కఠినంగా డీల్ చేయాలని సూచించారు. వివేకా హత్య కేసు వంటి సున్నితమైన కేసులలో నేరస్థులు సాక్ష్యాలను నాశనం చేయడం పెద్ద నేరమని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ హత్య కేసుల వంటి పాత కేసులను తిరిగి పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తే నేరాల రేటు 30 శాతం తగ్గుతుందని, ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.