ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను: సీఎం చంద్రబాబు
తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు.
- Author : Latha Suma
Date : 28-12-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
. ఐఏఎస్ అవ్వమన్నా ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చానన్న చంద్రబాబు
. తన అర్ధాంగి నారా భువనేశ్వరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం
. విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు సాధ్యమని హితవు
CM Chandrababu Naidu:హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు. యూనివర్సిటీ రోజుల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించానని, అతి తక్కువ కాలంలోనే మంత్రిగా, ఆపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం రావడం తనకు గర్వకారణమని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఈ బాధ్యత మరింతగా నిర్వర్తించాలనే సంకల్పంతో ఉన్నానన్నారు.
ఈ సందర్భంగా తన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. తాను రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్న సమయంలో, అయిష్టంగానే హెరిటేజ్ సంస్థ బాధ్యతలు స్వీకరించిన భువనేశ్వరి, తన పట్టుదలతో ఆ సంస్థను విశేషంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. నేను ఇప్పటికీ కాగితం చూసి మాట్లాడుతుంటే, ఆమె ట్యాబ్ ఉపయోగించి ప్రసంగిస్తున్నారు. నేను టెక్నాలజీ గురించి చెబుతుంటాను, ఆమె దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు. మామగారు ఎన్టీఆర్‌లాగే భువనేశ్వరికి కూడా పట్టుదల, మొండితనం ఉన్నాయని, ఏ పనిని ప్రారంభించినా పూర్తి చేసే వరకూ వదలరని పేర్కొన్నారు. భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా, ట్రస్టీగా అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడిపినందుకు లండన్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ సంస్థ భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డు తో పాటు వ్యక్తిగత పురస్కారాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్యక్రమానికి ముందుగా గండిపేట ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఎన్టీఆర్ విద్యా సంస్థల విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. ప్రాంగణంలో కలియతిరుగుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, చదువు ఎంత ముఖ్యమో, విలువలు అంతకంటే ముఖ్యమని హితవు పలికారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే ముందుకు సాగగలమన్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని జయించవచ్చని, ఆ తర్వాత సంపద స్వయంగా వస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.