Hafiz Saeed : హఫీజ్ సయీద్ హత్యకు గురయ్యాడా ? నిజాన్ని పాక్ దాస్తోందా ?
అబూ ఖతాల్ హత్యకు గురైన సమయంలో జీలంలోనే హఫీజ్ సయీద్(Hafiz Saeed) ఉన్నారని అంటున్నారు.
- Author : Pasha
Date : 17-03-2025 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
Hafiz Saeed : ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడుల మాస్టర్ మైండ్, లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హత్యకు గురయ్యాడా ? అనే దానిపై ఇప్పుడు పాకిస్తాన్‌లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఇటీవలే పాకిస్తాన్‌లోని జీలం ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో హఫీజ్ సయీద్ రైట్ హ్యాండ్ అబూ ఖతాల్ అలియాస్ నదీమ్ మసూద్ చనిపోయాడు. ఈ దాడి జరిగినప్పుడు సంఘటనా స్థలంలోనే ఉన్న మరో ఇద్దరు లష్కరే తైబా ఉగ్రవాదులకు గాయాలైనట్లు తెలిసింది. వారిద్దరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన రావల్పిండిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు చనిపోయారని ప్రకటించారు. మరణించిన ఆ ఉగ్రవాది పేరు ఫైజల్ మసూద్ అని వెల్లడించారు. రావల్పిండి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించిన మరో ఉగ్రవాది ఎవరు ? అతడికి ఏమైంది ? ఎలా ఉన్నాడు ? అనేది మాత్రం పాక్ అధికార వర్గాలు వెల్లడించడం లేదు. దీంతో ఆ వ్యక్తి మరెవరో కాదు.. లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ అనే టాక్ వైరల్ అవుతోంది.
Also Read :Shivaji Temple: శివాజీ ఆలయం ప్రారంభం.. ఔరంగజేబ్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు
జీలంలో హైఅలర్ట్ అందుకే.. ?
లష్కరే తైబా ఉగ్రవాదులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన తర్వాత.. జీలం ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. అక్కడి అన్ని రోడ్లు, వీధులు బ్లాక్ చేశారు. పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. అబూ ఖతాల్ హత్యకు గురైన సమయంలో జీలంలోనే హఫీజ్ సయీద్(Hafiz Saeed) ఉన్నారని అంటున్నారు. ఒకవేళ హఫీజ్ సయీద్ కూడా చనిపోయారనే వార్త వెలువడితే.. జీలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రాంతాన్ని పాక్ భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. హఫీజ్ సయీద్ లాంటి కీలక ఉగ్రవాది లక్ష్యంగా కాల్పులు జరగబట్టే.. జీలంలో ఇంతటి రేంజులో హైఅలర్ట్‌ను ప్రకటించారనే ప్రచారం జరుగుతోంది.
Also Read :Teenmar Mallanna : హాట్ టాపిక్ గా కేటీఆర్, మల్లన్న భేటీ..అసలు ఏంజరగబోతుంది..?
జైలులో నామ్ కే వాస్తే..
ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై లాహోర్ జైలులో హఫీజ్ సయీద్ శిక్షను అనుభవిస్తున్నాడని పాక్ చెబుతోంది. అయితే అనధికారికంగా అతడిని పాక్ దొడ్డి దారిలో బయటకు వదులుతోంది. ఈవిధంగా జైలు నుంచి బయటికి వచ్చిన హఫీజ్ సయీద్ .. జీలంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాడని అంటున్నారు. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌కు కూడా భారీ సెక్యూరిటీ ఉంటుంది. 2021లో హఫీజ్ ఇంటి వద్ద భారీ పేలుడు జరిగింది. దాని నుంచి అతడు కొంచెంలో తప్పించుకున్నాడు. 2023లో ఇద్దరు టాప్ లష్కరే ఉగ్రవాదులు హంజ్లా అదన్నాన్, రియాజ్ అహ్మద్‌లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వరుసగా దాడులు జరుగుతుండటంతో లష్కరే నేతలను భయం నీడలా వెంటాడుతోంది.