HMPV : హెచ్ఎంపీవీ కేసుల పై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
ఈ వైరస్ చైనాను దాటి ఇతర దేశాల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతుందని వివరించింది. అయితే ఇప్పటివరకు భారత్‌లో హెచ్‌ఎంపీవీ సోకిన కుటుంబ సభ్యులు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని స్పష్టం చేసింది.
- By Latha Suma Published Date - 08:00 PM, Mon - 6 January 25

HMPV : చైనాలో మొదలైన హెచ్‌ఎంపీవీ వైరస్ ప్రస్తుతం భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒకే రోజు మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కావడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సోమవారం భారత్‌లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 3 నెలల, 8 నెలల చిన్నారులకు వైరస్ సోకగా, గుజరాత్‌లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.
భారతదేశంలో ఈ వైరస్ కేసులు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల సాధారణ పర్యవేక్షణలో భాగంగా గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ చైనాను దాటి ఇతర దేశాల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతుందని వివరించింది. అయితే ఇప్పటివరకు భారత్‌లో హెచ్‌ఎంపీవీ సోకిన కుటుంబ సభ్యులు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని స్పష్టం చేసింది. హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాల్లాగే ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో వైరస్ సోకిన చిన్నారికి చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వైరస్ వల్ల బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు. లక్షణాలు బయటపడేందుకు 3 నుంచి 6 రోజులు పడుతుందని పేర్కొన్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటాయి. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, వృద్ధులు హెచ్‌ఎంపీవీకి అధికంగా గురికావచ్చని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి అన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రుల వద్ద తగిన మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. భారత్‌లో పరిస్థితి ఇంకా నియంత్రణలోనే ఉందని, అప్రమత్తంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, వృద్ధులు హెచ్‌ఎంపీవీకి అధికంగా గురికావచ్చని చెబుతున్నారు.
Read Also: Motorcycle Sized Tuna : రూ.11 కోట్లు పలికిన ట్యూనా చేప.. బైక్ రేంజులో సైజు, బరువు !