Varun Chakaravarthy: టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా టీమిండియా స్పిన్నర్!
సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో చక్రవర్తికి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ముంబైలో నాలుగు వికెట్లు తీయడంలో వరుణ్ చక్రవర్తి విజయం సాధిస్తే.. టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 03:46 PM, Sun - 2 February 25

Varun Chakaravarthy: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కోల్‌కతా, చెన్నై, రాజ్‌కోట్, పుణెలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3, 2, 5, 2 వికెట్లు తీశాడు. 12 వికెట్లతో చక్రవర్తి ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌లో అతను తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలనుకుంటున్నాడు. ఈ సమయంలో అతను పెద్ద రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
చరిత్ర సృష్టించే అవకాశం
సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో చక్రవర్తికి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ముంబైలో నాలుగు వికెట్లు తీయడంలో వరుణ్ చక్రవర్తి విజయం సాధిస్తే.. టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Trisha Gongadi: ఇండియాకు వరల్డ్ కప్ అందించిన తెలంగాణ బిడ్డ.. ఎవరీ గొంగడి త్రిష?
భారత్ తరఫున టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చక్రవర్తి రికార్డు సృష్టించాడు. టీ20 సిరీస్‌లో కనీసం 10 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసిన ఏకైక భారత బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. ఐదో టీ20లో చక్రవర్తి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీస్తే భారత క్రికెటర్‌గా టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. నవంబర్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి 12 వికెట్లు పడగొట్టాడు.
సిరీస్ కైవసం చేసుకున్న భారత్
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భాగంగా చివరి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ జట్టు చూస్తోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది.