Jasprit Bumrah: ఐపీఎల్ ఆడకుంటే ఏం కాదు.. బూమ్రాకు మాజీ క్రికెటర్ల సలహా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా గాయం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది.
- By Maheswara Rao Nadella Published Date - 09:15 AM, Wed - 22 February 23

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah) గాయం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. అతను జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉందంటూ పలువురు మాజీ ఆటగాళ్ళు విమర్శిస్తున్నారు. గాయం పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, ఫిట్‌నెస్ సమస్యలతో దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమయ్యాడు.
గతేడాది ఇంగ్లండ్ టూర్ లో ఉన్న సమయంలో ఈ గాయం కాగా.. తర్వాత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో సిరీస్ కోసం మొదట ఎంపిక చేసినా.. తర్వాత అతన్ని పక్కన పెట్టారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని కూడా భావించినా కుదర్లేదు. ఫిట్‌నెస్ పూర్తిస్థాయిలో లేకపోవడంతో మరోసారి పెద్ద సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే బూమ్రాకు (Jasprit Bumrah) మిగిలిన తర్వాతి ఆప్షన్ ఐపీఎల్ మాత్రమే. ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఆడే బుమ్రా.. కచ్చితంగా ఈ మెగా లీగ్ లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. అటు బుమ్రాతోపాటు ముంబై ఫ్రాంఛైజీకి కూడా కీలకమైన సూచన చేశాడు. ఐపీఎల్ 2023లో బుమ్రాపై భారాన్ని మోపే విషయంలో బీసీసీఐ చెప్పినట్లుగా ముంబై టీమ్ నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.
ముందు తాను ఇండియన్ ప్లేయర్ అనీ, తర్వాతే ఫ్రాంచైజీకి ఆడుతున్న విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. ఒకవేళ బుమ్రా ఏదైనా అసౌకర్యానికి గురైతే బీసీసీఐ వెంటనే రంగంలోకి దిగాలన్నాడు. జోఫ్రా ఆర్చర్ తో కలిసి బుమ్రా ఏడు మ్యాచ్ లలో ఆడకపోతే ప్రపంచమేమీ అంతమవదంటూ కాస్త ఘాటుగానే ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా పరిస్థితిని బట్టి.. బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, ముంబై ఇండియన్స్ కలిసి ఐపీఎల్ అతని పనిభారం గురించి నిర్ణయం తీసుకోవాలని చోప్రా సూచించాడు. ఫిట్ గా ఉంటే మాత్రం ఆడుతూనే ఉండాలనీ, అదే ప్లేయర్ ను మెరుగు పరుస్తుందన్నాడు. ఒకవేళ కాస్త ఇబ్బంది ఉన్నా ఫ్రాంచైజీ ప్రయోజనాలను పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవాలన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ, బూమ్రా ఏమాత్రం రాజీ పడొద్దని తేల్చి చెప్పాడు. ఎందుకంటే బూమ్రా టీమిండియా గొప్ప ఆటగాడని, ఫ్రాంచైజీల కోసం అలాంటి ప్లేయర్ గాయంతో ఆడుకోవడం మంచిదికాదన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లోపు ఫిట్‌నెస్ సాధిస్తే ఇరానీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్‌లో ఆడాలని కూడా చోప్రా సూచించాడు.
Also Read: Electric Car: ప్రపంచంలోనే మొట్టమొదటి ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ కారు