శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జట్టులోకి పునరాగమనం?
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
- Author : Gopichand
Date : 25-12-2025 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
Shreyas Iyer: ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయంపై కీలక సమాచారం వెలువడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ సందర్భంగా పక్కటెముకల గాయంతో మైదానం వీడిన అయ్యర్ ఇప్పుడు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయ్యర్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడిన ఒక బీసీసీఐ అధికారి అయ్యర్ ఆరోగ్య స్థితి గురించి వెల్లడించారు. డిసెంబర్ 24న ముంబైలో అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. తదుపరి పరీక్షల కోసం అయ్యర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లారు. అక్కడ అతను 4 నుండి 6 రోజుల పాటు గడుపుతారు.
అయ్యర్ ఎప్పుడు జట్టులోకి వస్తారో ఖచ్చితమైన తేదీ చెప్పలేము కానీ, అతను విజయ్ హజారే ట్రోఫీ ద్వారా తిరిగి మైదానంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు. ఆటగాడి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోమని, ఎన్‌సీఏ వైద్య బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి నిర్ణయం ఉంటుందని అధికారి స్పష్టం చేశారు.
Also Read: మీ పిల్లలకు రాయడం నేర్పించే పద్ధతులు ఇవే!
గాయం ఎలా జరిగింది?
అక్టోబర్ 25న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో అయ్యర్ పక్కటెముకలకు దెబ్బ తగిలింది. ఆ గాయం ఎంత తీవ్రంగా ఉందంటే అతను ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి కూడా రాలేకపోయాడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
న్యూజిలాండ్ సిరీస్‌లో అవకాశం?
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, అతను ఖచ్చితంగా జట్టులో చోటు సంపాదిస్తారు.