PKXI vs RCB: అదరగొట్టిన సిరాజ్… బెంగళూరు మూడో విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాట పట్టింది. పంజాబ్ కింగ్స్ పై 24 రన్స్ తేడాతో విజయం సాధించింది.
- By Naresh Kumar Published Date - 08:10 PM, Thu - 20 April 23

PKXI vs RCB IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మళ్లీ గెలుపు బాట పట్టింది. పంజాబ్ కింగ్స్ (PKXI) పై 24 రన్స్ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో డుప్లేసిస్, బౌలింగ్ లో సిరాజ్ అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పిచ్ స్లోగా ఉండటంతో ఆరంభంలో కాస్త స్లోగా ఆడిన ఈ జోడీ.. తర్వాత ధాటిగా ఆడింది. ఆర్‌సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం స్పిన్నర్ల ఎంట్రీతో పరుగుల వేగం తగ్గింది. డుప్లెసిస్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ విరాట్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరూ వరుసగా ఔటవడంతో బెంగుళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84, కోహ్లీ 47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 59 రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు మహమ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అథర్వను సిరాజ్ ఔట్ చేశాడు. అంపైర్ ఔటివ్వకపోయినా.. ఆర్‌సీబీ రివ్యూతో ఫలితం రాబట్టింది. హసరంగా వేసిన మూడో ఓవర్‌లో మాథ్యూ షార్ట్ ఔటవగా…అంచనాలు పెట్టుకున్న లివింగ్ స్టోన్ ను సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
దీంతో పంజాబ్ పవర్ ప్లేలో 4 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హాఫ్ సెంచరీకి చేరువైన ప్రభ్ సిమ్రాన్ సింగ్‌ను పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేయడం…తర్వాత షారూఖ్ ఖాన్ ను హసరంగా ఔట్ చేయడంతో పంజాబ్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
చివర్లో జితేశ్ శర్మ భారీ షాట్లతో భయపెట్టినా.. మిగిలిన వారి నుంచి సపోర్ట్ లేకపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 , జితేశ్ శర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 రన్స్ చేశారు. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. హసరంగా రెండు, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. కెరీర్ బెస్ట్ నమోదు చేసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Salary Account vs Savings Account: మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి..