IND vs AUS: ఆసీస్‌పై భారత్ ఘనవిజయం.. అదరగొట్టిన రోహిత్, కోహ్లీ!
237 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమ్ ఇండియా 69 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ కేవలం 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
- By Gopichand Published Date - 03:55 PM, Sat - 25 October 25
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 121 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా (IND vs AUS) విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా 74 పరుగులతో అర్ధ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ను భారత్ గెలిచినప్పటికీ సిరీస్‌ను మాత్రం ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి విజయం.
భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను పూర్తి 50 ఓవర్లు కూడా ఆడనీయలేదు. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు కేవలం 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున హర్షిత్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఇది ODIలలో హర్షిత్ అత్యుత్తమ ప్రదర్శన.
Also Read: CNG Cars: మీకు తక్కువ బడ్జెట్‌లో సీఎన్‌జీ కారు కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి!
మెరిసిన కోహ్లీ-రోహిత్
237 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమ్ ఇండియా 69 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ కేవలం 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో గిల్ బ్యాట్ చప్పుడు చేయలేకపోయింది. అతను 3 ఇన్నింగ్స్‌లలో కేవలం 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ కలిసి జట్టును ముందుకు నడిపించి భారత్‌కు విజయాన్ని అందించేవరకు విశ్రమించలేదు.
రోహిత్ శర్మ అజేయంగా 121 పరుగులు చేశాడు. ఇది అతని ODI కెరీర్‌లో 33వ, అంతర్జాతీయ కెరీర్‌లో 50వ సెంచరీ. అతను రెండవ వికెట్‌కు 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ODIలలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది 19వ సారి. 100+ పరుగుల భాగస్వామ్యాల సంఖ్యలో ఇప్పుడు సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ, కుమార్ సంగక్కర-తిలకరత్నె దిల్షాన్ మాత్రమే వారి కంటే ముందున్నారు.
శుభ్‌మన్ గిల్ మొదటి విజయం
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుభ్‌మన్ గిల్‌ను కొత్త ODI కెప్టెన్‌గా నియమించారు. అతని సారథ్యంలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అడిలైడ్‌లో జరిగిన రెండవ ODI మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినా అక్కడ కూడా భారత్ 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కెప్టెన్‌గా మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత గిల్ చివరకు సిడ్నీలో విజయాన్ని నమోదు చేశాడు.