World Cup 2023: మీకు ఇష్టమొచ్చిన వేదికల్లో ఆడతామంటే కుదరదు పాక్ బోర్డుకు బీసీసీఐ షాక్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ఇంకా మూడు నెలలే మిగిలి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్, వేదికలకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది.
- Author : Praveen Aluthuru
Date : 20-06-2023 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ఇంకా మూడు నెలలే మిగిలి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్, వేదికలకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. అయితే భారత్ కు వచ్చే విషయంలో రోజుకో మాట చెబుతున్న పాక్ క్రికెట్ బోర్డు ఈ వంకతో తమ వేదికలపై మినహాయింపులు అడుగుతోంది. అఫ్ఘనిస్థాన్ తో చెన్నైలో ఆడలేమంటూ వేదిక మార్చాలని ఐసీసీని కోరింది. తాజాగా దీనిపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు పాక్ క్రికెట్ బోర్డు తీరుపై మండిపడ్డారు. వారికిష్టమైన వేదికల్లోనే మ్యాచ్ లు ఆడాతమంటే కుదరదని వ్యాఖ్యానించారు. ఏ పెద్ద టోర్నీలోనైనా వేదిక మార్పు విషయంలో భద్రతా పరమైన అంశాలే ప్రధాన కారణంగా ఉండాలన్నారు. అంతే తప్ప తమ జట్టు బలం, బలహీనతలను ఆధారంగా చేసుకుని వేదికలు మార్చాలంటే కుదరదని తేల్చి చెప్పారు.
చెన్నై పిచ్ సహజంగా స్పిన్ కు అనుకూలిస్తుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ ఈ పిచ్ పై ఎంతో బలమైన స్పిన్నర్లున్న ఆప్ఘనిస్థాన్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు చేయడం పాక్ బ్యాటర్లకు కష్టమే. పైగా వీరిద్దరూ ఐపీఎల్ ఆడుతూ ఇక్కడి వాతావరణం, పిచ్ లకు బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఇదే పాక్ జట్టును భయపెడుతోంది. ఏదైనా అటూ ఇటూ అయితే ఆప్ఘన్ టీమ్ చేతిలో ఓడామంటే తమ అభిమానుల ఆగ్రహానికి పాక్ గురికావాల్సి ఉంటుంది. అందుకే వేదికను మార్చాలంటూ పదే పదే ఐసీసీకి విజ్ఞప్తి చేస్తోంది.
తాజాగా బీసీసీఐ, ఐసీసీ మెగా టోర్నీ ముసాయిదా షెడ్యూల్ పై చర్చిస్తున్నారు. బీసీసీఐ సమర్పించిన షెడ్యూల్, వేదికలకు ఐసీసీ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పాక్ క్రికెట్ బోర్డు వైఖరి కారణంగానే షెడ్యూల్ ఆలస్యమవుతోందని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. భద్రతా కారణాలైతే తాము వేదికల్లో మార్పు చేస్తామని, అంతే తప్ప పిచ్, తమ జట్టు బలం వంటి కారణాలతో వేదికలు మార్చలేమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అలా అయితే ప్రతీ జట్టూ ఇలాంటి విజ్ఞప్తులే చేస్తాయని, అప్పుడు షెడ్యూల్ కూర్పు సాధ్యపడదని వివరించింది. బీసీసీఐ వాదనతో ఐసీసీ కూడా ఏకీభవించినట్టు సమాచారం. పాక్ బోర్డుకు చివరిసారిగా ఈ విషయాన్ని తెలియజేసి త్వరలోనే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశముంది.