Himalaya Mountains: కరుగుతోన్న హిమాలయాలు.. రాబోయే రోజుల్లో జలప్రళయం తప్పదా..? తాజా నివేదికలు ఏం చెప్పాయంటే?
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆసియాలోని హిందూ కుష్ హిమాలయాల్లోని హిమానీనదాలు శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణాన్ని 75శాతం వరకు కోల్పోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
- Author : News Desk
Date : 20-06-2023 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
వాతావరణంలో మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమానీనదాలు (Glaciers) మనుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ప్రభావంతో మరికొద్ది రోజుల్లో జలప్రళయం తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు (Scientists) విస్తుపోయే వాస్తవాలతో నివేదికను రూపొందించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) మంగళవారం విడుదల చేసిన నివేదికలో హిమాలయాల్లో ఏర్పడబోయే జల ప్రళయాల గురించి శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. వాతావరణం వేడెక్కుతుండటంతో హిమాలయాల్లో మంచు కరుగుతుందనేది ఊహించిన విషయమే. కానీ, శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. ఊహించిన దానికంటే వేగంగా హిమాలయాలు కరిగిపోతున్నాయట.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆసియాలోని హిందూ కుష్ హిమాలయాల్లోని హిమానీనదాలు శతాబ్దం చివరి నాటికి అంటే మరో 80ఏళ్లలో 75శాతం వరకు కోల్పోతాయని, దీనివల్ల పర్వత ప్రాంతంలో నివసించే 240 మిలియన్ల ప్రజలకు ప్రమాదకరమైన వరదలు, నీటికొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తాజా నివేదికలో వెల్లడించారు. ఎవరెస్ట్, కే2 యొక్క ప్రసిద్ధ శిఖరాలకు నిలయమైన ఈ ప్రాంతంలో మంచునష్టం వేగంగా పెరుగుతోందని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. హిందూ కుష్ హిమాలయాలు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్ మీదుగా 3,500 కి.మీ (2,175 మైళ్లు) విస్తరించి ఉన్నాయి.
కొండచరియలు విరిగిపడటానికి కారణం హిమానీనదాలు కరగడమేనని అమెరికా జియలాజికల్ సర్వే శాటిలైట్ చిత్రాల ఆధారంగా చైనా సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు చెప్పారు. 2009 నుంచి 2018 మధ్య మొత్తం 127 కొండచరియలు విరిగిపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాల్లోని హిందూకుష్ ప్రాంతంలో 50వేలకుపైగా హిమానీనదాలు ఉన్నాయి. ఈ హిమానీ నదాలు కరిగితే ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.