Axar Patel: రేపు పాక్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా కీలక ఆటగాడు దూరం?!
అక్షర్ పటేల్ ఆడకపోతే టీమ్ ఇండియా తన బౌలింగ్‌లో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్షర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన స్పిన్ త్రయం విడిపోతుంది.
- By Gopichand Published Date - 04:39 PM, Sat - 20 September 25

Axar Patel: ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఒమన్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ, ఈ గెలుపు భారత్ శిబిరంలో ఆందోళన కలిగించే విషయం. కీలక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం ఇప్పుడు జట్టుకు పెద్ద సమస్యగా మారింది. సెప్టెంబర్ 21న జరగబోయే పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌కి అక్షర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.
ఒమన్‌తో మ్యాచ్‌లో గాయం
ఒమన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో హమ్మద్ మీర్జా కొట్టిన ఒక ఎత్తైన షాట్‌ను అందుకోవడానికి అక్షర్ పరుగెత్తాడు. అయితే క్యాచ్ పట్టుకోవడంలో విఫలమై కింద పడినప్పుడు అతని తల గట్టిగా నేలకు తగిలింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అక్షర్‌ను ఫిజియో సహాయంతో వెంటనే మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ గాయం భారత్‌ను కలవరపరుస్తోంది. మ్యాచ్‌లో అక్షర్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి నాలుగు పరుగులు ఇచ్చాడు. కానీ బ్యాటింగ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 26 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్‌తో భారత్ స్కోరును 188/8కు చేర్చడంలో తన వంతు కృషి చేశాడు.
Also Read: Hyderabad Pearls: హైదరాబాద్ ముత్యాలకు జీఐ ట్యాగ్ గుర్తింపు కోసం ప్రయత్నాలు!
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అక్షర్ ఆడతాడా?
సూపర్ 4 దశలో భారత్ తదుపరి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండటంతో అక్షర్ గాయం నుంచి కోలుకోవడం కష్టమని ESPNcricinfo నివేదిక వెల్లడించింది. దీనిపై టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ మాట్లాడుతూ.. “నేను అక్షర్‌ను చూశాను. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని మాత్రమే చెప్పగలను” అని తెలిపారు. కానీ అతని పూర్తి ఫిట్‌నెస్ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అక్షర్ ఆడటం అనుమానమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్షర్ లేకపోతే భారత్ వ్యూహం ఏమిటి?
అక్షర్ పటేల్ ఆడకపోతే టీమ్ ఇండియా తన బౌలింగ్‌లో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్షర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన స్పిన్ త్రయం విడిపోతుంది. ఇది జట్టుకు పెద్ద లోటు. అతని స్థానంలో జట్టులో ఒక ఫాస్ట్ బౌలర్‌ను తీసుకునే అవకాశం ఉంది. లేదా రిజర్వ్ ఆటగాళ్ళ జాబితాలో ఉన్న మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్-స్పిన్ బౌలింగ్‌లోనూ రాణించగలడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు అక్షర్ ఆరోగ్యంపై పూర్తి స్పష్టత వస్తేనే టీమ్ ఇండియా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.