Hyderabad Pearls: హైదరాబాద్ ముత్యాలకు జీఐ ట్యాగ్ గుర్తింపు కోసం ప్రయత్నాలు!
నగరానికి 'భారత ముత్యాల నగరం'గా గుర్తింపు తెచ్చిన వాటిలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. జీఐ ట్యాగ్ లభిస్తే నగరంలోని శతాబ్దాల నాటి ముత్యాల వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, దాని నగల వారసత్వానికి ప్రపంచ గుర్తింపు లభిస్తుంది.
- By Gopichand Published Date - 04:26 PM, Sat - 20 September 25

Hyderabad Pearls: తమ మెరుపు, కళాత్మకతకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ ముత్యాలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల నగరానికి చెందిన లక్క గాజులకు ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్ లభించిన తర్వాత ఈ ముందడుగు పడింది. హైదరాబాద్ ముత్యాలు (Hyderabad Pearls) తమ మెరుపు, నాణ్యత, క్లిష్టమైన కళాత్మకతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నగరానికి ‘భారత ముత్యాల నగరం’గా గుర్తింపు తెచ్చిన వాటిలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. జీఐ ట్యాగ్ లభిస్తే నగరంలోని శతాబ్దాల నాటి ముత్యాల వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, దాని నగల వారసత్వానికి ప్రపంచ గుర్తింపు లభిస్తుంది. స్థానిక కళాకారుల ప్రాచుర్యం కూడా పెరుగుతుందని ఆశించబడింది.
హైదరాబాద్ ముత్యాల కోసం దరఖాస్తును రెసొల్యూట్4ఐపి, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన బొమ్మల పరిశ్రమ, జీఐ- వీవీఎంపీ నోడల్ ఆఫీసర్ అయిన మందాడి శ్రీహ రెడ్డి సహకారంతో చేపడుతోంది. హైదరాబాద్-సికింద్రాబాద్ పెర్ల్స్ అండ్ జ్యువెలరీ మర్చంట్స్ అసోసియేషన్, తెలుగు పెర్ల్ మర్చంట్ అసోసియేషన్ ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తున్నాయి.
Also Read: CBN : చెత్త రాజకీయాలు చేస్తే..చెత్త పారేసినట్లు పారేస్తా – చంద్రబాబు వార్నింగ్
ఈ పరిణామంపై రెసొల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీగల్, ఐపిఆర్ హెడ్, రెసొల్యూట్4ఐపి వ్యవస్థాపకుడు సుభాజిత్ సాహా మాట్లాడుతూ.. “నారాయణపేట చీరలు, లక్క గాజులు విజయవంతం అయిన తర్వాత హైదరాబాద్ ముత్యాలకు జీఐ ట్యాగ్ లభించడం సముచితం. ఈ గుర్తింపు సంప్రదాయాన్ని కాపాడటమే కాకుండా ముత్యాల కళాకారులు, వ్యాపారులకు కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుంది. అదే సమయంలో ముత్యాల నగరంగా హైదరాబాద్ ప్రపంచ గుర్తింపును మరింత బలపరుస్తుంది” అని అన్నారు.