టీం ఇండియా బిజీ షెడ్యూల్.. ఐపీఎల్ తర్వాత జింబాబ్వే పర్యటనకు!
2027 వరల్డ్ కప్ జింబాబ్వే, నమీబియా, దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఈ పర్యటన ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది.
- Author : Gopichand
Date : 31-03-2026 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
Team India: ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు అస్సలు విశ్రాంతి లభించేలా లేదు. టీం ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ముఖ్యంగా ICC వన్డే వరల్డ్ కప్ 2027 సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుని జూలైలో భారత్ మరో కీలక సిరీస్ ఆడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే ఈ సిరీస్ ఉండవచ్చని సమాచారం.
మరో సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత్
‘క్రికెట్ ఫైనాన్షియల్ జర్నల్’ నివేదిక ప్రకారం.. భారత జట్టు 2026 జూలై చివరిలో జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడే అవకాశం ఉంది. దీనిపై బీసీసీఐ (BCCI) ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, 2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2027 వరల్డ్ కప్ జింబాబ్వే, నమీబియా, దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఈ పర్యటన ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది.
గత నాలుగేళ్లలో భారత్ జింబాబ్వేలో పర్యటించడం ఇది మూడోసారి కానుంది. ఈ పర్యటనలో సెలక్టర్లు ముఖ్యంగా వన్డే, టీ-20ల్లో రాణించే యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తున్నారు.
Also Read: తలస్నానం చేసే సరైన పద్ధతి ఇదే అని మీకు తెలుసా?!
బీసీసీఐ ప్రణాళికలు- వరుస పర్యటనలు
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత టీం ఇండియా షెడ్యూల్ ఇలా ఉండబోతోంది.
అఫ్గానిస్థాన్‌తో హోమ్ సిరీస్: సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో 1 టెస్టు, 3 వన్డేలు.
ఐర్లాండ్ పర్యటన: ఐర్లాండ్‌తో 2 టీ-20 మ్యాచ్‌ల సిరీస్.
ఇంగ్లాండ్ పర్యటన: జూన్ చివరిలో, జూలై ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో 3 వన్డేలు, 3 టీ-20లు.
జింబాబ్వే పర్యటన (ప్రతిపాదిత): జూలై చివరిలో 3 టీ-20ల సిరీస్.
మరోవైపు, 2027 జనవరిలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ సమయంలో ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది.