CONGRESS vs BRS : పవర్ పాలిటిక్స్.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్..?
- Author : Prasad
Date : 31-05-2026 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని తెలిపారు. ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మాట తప్పితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని బహిరంగంగా ప్రకటించడానికి తాను సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తే, బీఆర్ఎస్ కూడా తమ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సవాల్ చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందించే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని.. తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయాభివృద్ధికి కీలక బలంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడ్డాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) ప్రకటించిన పంటలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 15లోగా రైతుల ధాన్యం, ఇతర పంటల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రత్యేక “రైతు డిస్కాం” ఏర్పాటు ప్రతిపాదనను కూడా సీఎం వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం, విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయడం దీని లక్ష్యమని చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సీఎం.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చారు.