Congress : తక్కువ సీట్లలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో చెప్పేసిన ఖర్గే
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయడం అనేది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
- By Pasha Published Date - 02:02 PM, Wed - 22 May 24

Congress : ఈ లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయడం అనేది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కలిసికట్టుగా ఉంచడానికే తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నామన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో సంప్రదింపులు జరిపాకే ప్రతి రాష్ట్రంలోనూ పొత్తులను పెట్టుకునేందుకు కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసిందని ఖర్గే తెలిపారు. కేరళ, బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి దీనివల్ల ఆటంకమేదీ ఏర్పడదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన కూటమి ఉందని.. ఏదేమైనా తమ టార్గెట్ మాత్రం బీజేపీ ఒక్కటేనని ఖర్గే స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘దేశ ప్రయోజనాల కోసమే ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. వయనాడ్, రాయ్ బరేలి రెండు చోట్ల కూడా గెలిస్తే రాహుల్ ఏ సీటును నిలుపుకుంటారనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం’’ అని కాంగ్రెస్ చీఫ్ తేల్చిచెప్పారు. ‘‘ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ మా పార్టీ ఆస్తులు. వాళ్లు మా స్టార్ క్యాంపెయినర్లు కూడా. వారి ప్రసంగాలు వినడానికి వేలాది మంది ప్రజలు వస్తారు ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ప్రియాంకా గాంధీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. సోనియా గాంధీ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆమెకు బాగా తెలుసు’’ అని కాంగ్రెస్(Congress) చీఫ్ ఖర్గే తెలిపారు.
Also Read : Water Maidens : హైదరాబాద్‌లో సాగర కన్యల సందడి
‘‘ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో మెజారిటీ మార్క్ ను అందుకుంటుంది. అధికారంలోకి వస్తే చట్టాలన్నింటినీ సమీక్షిస్తాం. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ చట్టాన్నైనా వ్యతిరేకిస్తాం. బీజేపీలా దర్యాప్తు సంస్థలను ఇప్పటివరకు ఏ పార్టీ కూడా దుర్వినియోగం చేయలేదు. దర్యాప్తు సంస్థలు సోదాలు జరపడం తప్పు కాదు. కేసులపై సరైన విచారణ జరపాలి. కానీ బీజేపీ తప్పుడు కేసులు సృష్టించి విపక్ష నేతలను కటకటాలపాలు చేస్తోంది. ఎన్నికలప్పుడే విపక్ష నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యానికి ఇలాంటివి మంచిది కాదు’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు.