Kami Rita : 30వ సారీ ఎవరెస్టును ఎక్కేశాడు.. 10 రోజుల్లో రెండోసారి అధిరోహించిన కామి రీటా
నేపాలీ షెర్పా కామి రీటా కేవలం 10 రోజుల గ్యాప్ తర్వాత మరో రికార్డును సొంతం చేసుకున్నారు.
- By Pasha Published Date - 11:33 AM, Wed - 22 May 24

Kami Rita : నేపాలీ షెర్పా కామి రీటా కేవలం 10 రోజుల గ్యాప్ తర్వాత మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన 30వ సారి కూడా ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. బుధవారం ఉదయం 7:49 గంటలకు కామి రీటా ఎవరెస్ట్ శిఖరంపైకి ఎక్కారు. దీంతో ప్రపంచంలో అత్యధికసార్లు ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా తన పేరిట ఉన్న రికార్డును 54 ఏళ్ల కామి రీటా తిరగ రాసుకున్నారు. చివరిసారిగా మే 12న ఎవరెస్టు పర్వతాన్ని కామి రీటా అధిరోహించారు. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కడం అంటే ఆషామాషీ విషయం కాదు. దీని కోసం ఎంతో ఫిట్‌నెస్ ఉండాలి. అంతకుమించిన సాహసం, సహనం కూడా అత్యవసరం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే.. కామి రీటా(Kami Rita) వరుస పెట్టి ఎవరెస్టును అవలీలగా ఎక్కేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- కామి రీటా నేపాల్‌లోని సోలుఖుంబులోని థేమ్ గ్రామస్తుడు.
- అతడు ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’ అనే పర్వతారోహణ సహాయక సేవలు అందించే సంస్థలో సీనియర్ గైడ్‌గా పనిచేస్తున్నారు.
- కామి రీటా పర్వతారోహణ చేయడాన్ని 1992లో మొదలుపెట్టారు.
- ఆయన గతంలో K2, చో ఓయు, లోట్సే, మనస్లు పర్వతాలను కూడా అధిరోహించారు.
- సోలుఖుంబుకు చెందిన పసాంగ్ దావా అనే మరో షెర్పా కూడా గత ఏడాది 27వ సారి ఎవరెస్టును అధిరోహించాడు. అయితే అతడు ఇంకా పర్వతారోహణలు చేస్తాడా ? చేయడా ? అనేది తెలియదు. ప్రస్తుతానికి అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
- దీంతో ప్రస్తుతానికి ఎక్కువ సార్లు ఎవరెస్టు ఎక్కిన వ్యక్తిగా కామి రీటా పేరిట రికార్డు నిలిచింది.
Also Read :Passphrases : ఫుల్ సెక్యూరిటీ కావాలా ? ‘పాస్వర్డ్’ బదులు ‘పాస్‌ఫ్రేజ్’ వాడండి!
- ఎవరెస్టు పర్వతారోహణకు అనుమతి కావాలంటే నేపాల్ ప్రభుత్వానికి విదేశీయులు దాదాపు రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది.
- ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’ లాంటి సంస్థలలో నిపుణులైన పర్వతారోహకులు (షెర్పాలు) ఉద్యోగులుగా ఉంటారు. ఈ సంస్థలకు ఫీజును చెల్లించి, షెర్పాల టీమ్ పర్యవేక్షణలో టూరిస్టులు ఎవరెస్టును ఎక్కేయొచ్చు.
- మొత్తంగా విదేశీ టూరిస్టులు ఎవరెస్టును ఎక్కడానికి దాదాపు రూ.33 లక్షల నుంచి రూ.75 లక్షల దాకా ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఎవరెస్టు యాత్ర ఖర్చు మరింత పెరుగుతుంది, ఎందుకంటే ఇది సాధారణంగా సంవత్సరంలో రెండు వారాలు మాత్రమే ఉంటుంది.
- 1953 సంవత్సరం మేలో టెన్జింగ్ నార్గే షెర్పా, న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ పెర్సివల్ హిల్లరీ తొలిసారిగా ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించారు.
- 1953 నుంచి ఇప్పటివరకు దాదాపు 7వేల మంది పర్వతారోహకులు నేపాల్ నుంచి ఎవరెస్టును ఎక్కారు.