BJP : ఈ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు : బీజేపీ
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం ప్రైవేటు ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు.
- By Latha Suma Published Date - 02:32 PM, Wed - 16 April 25

BJP : బీజేపీ మరోసారి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ అభియోగపత్రం మోపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం ప్రైవేటు ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
Read Also: CM Chandrababu : అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫొటో ఎగ్జిబిషన్
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుందని ఆరోపించారు. శ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబయి, లఖ్‌నవూ, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారని ఆరోపించారు.
అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదని..ప్రధాని నరేంద్ర మోడీ నడిపిస్తున్న దేశమని అన్నారు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యానని..చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల పై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగపత్రం నమోదు చేసింది. కాంగ్రెస్ నేతలు శ్యాం పిట్రోడా, సుమన్ దుబె తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. సోనియాను మొదటి నిందితురాలి (ఏ-1)గా, రాహుల్‌ను ఏ-2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీనిని పరిశీలించి, తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు.
Read Also: Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ