యాంటీఆక్సిడెంట్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, కణాలను రక్షించే శక్తివంతమైన అణువులు.
- Author : Latha Suma
Date : 02-01-2026 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
. యాంటీఆక్సిడెంట్లు..ఆరోగ్యానికి అద్భుతమైన రక్షణ కవచం
. చర్మం, గుండె మరియు మెదడు ఆరోగ్యంపై ప్రభావం
. ఎలాంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తాయి?
Anti Oxidants : సాధారణంగా మనం రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, కణాలను రక్షించే శక్తివంతమైన అణువులు. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని కాపాడటంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మన శరీరంలో జీవక్రియల సమయంలో ఫ్రీ రాడికల్స్ అనే అస్థిర అణువులు ఏర్పడతాయి. ఇవి కణాలను దెబ్బతీసి ముందస్తు వృద్ధాప్యం, రోగాలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి, కణాలపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. విటమిన్ ఎ, సి, ఇ, సెలీనియం, ఫ్లేవనాయిడ్స్, ఫ్లేవోన్లు, ఫైటో కెమికల్స్ వంటి పోషకాలు సాధారణంగా లభించే యాంటీఆక్సిడెంట్లలోకి వస్తాయి. ఇవి ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాల్లో లభిస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శరీరానికి సహజ రక్షణ వ్యవస్థ బలపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో, చర్మం కాంతివంతంగా ఉండటంలో ఇవి సహాయపడతాయి. ఎండలోని యూవీ కిరణాలు, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా యాంటీఆక్సిడెంట్లు కీలకం. చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి దోహదం చేసి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కనిపించే జ్ఞాపకశక్తి తగ్గుదలని కూడా యాంటీఆక్సిడెంట్లు కొంతవరకు అడ్డుకుంటాయి. అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆహారాల్లో కూరగాయలు, పండ్లు ప్రధానమైనవి. బెర్రీస్, నారింజ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు, వివిధ రకాల ఆకుకూరలు, బెల్ పెప్పర్, టమాటా లాంటివి మంచి వనరులు. అలాగే గ్రీన్ టీ, కాఫీ, డార్క్ చాక్లెట్‌లో కూడా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాల్లో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఇవి ఉపయోగపడతాయి. రోజువారీ ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకుంటే శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. చిన్న మార్పులతోనే పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.