Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
- By Gopichand Published Date - 06:32 PM, Wed - 23 July 25

Minister Lokesh: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) చొరవతో విశాఖ మహానగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకోబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం (జులై 23) జరిగిన 9వ ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో భారీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు సంబంధించిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కీలక ప్రాజెక్టుల వివరాలు
సత్వ డెవలపర్స్: ఇటీవల బెంగళూరు పర్యటన సందర్భంగా లోకేష్ చేసుకున్న ఒప్పందాల ఫలితంగా సత్వ డెవలపర్స్ విశాఖ మధురవాడలో రూ. 1500 కోట్ల పెట్టుబడులతో 25,000 ఉద్యోగాలు కల్పించనుంది.
ఎఎన్ఎస్ఆర్ సంస్థ: ఈ సంస్థ రూ. 1000 కోట్ల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ను ఏర్పాటు చేయడం ద్వారా 10,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
Also Read: China : బుద్ధి మార్చుకోని చైనా.. భారత్ పై బంగ్లాదేశ్ లో కుతంత్రాలు..
సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (డేటా సెంటర్): విశాఖపట్నంలో డేటా సెంటర్ పై మొదటి దశలో రూ. 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవ దశలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు, 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (వరల్డ్ ట్రేడ్ సెంటర్): విశాఖ ఎండాడలో ఈ సంస్థ రూ. 1250 కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటుచేయబోతోంది. దీని ద్వారా 15,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఐటీ దిగ్గజాల ప్రవేశం: ప్రఖ్యాత ఐటీ సంస్థలైన టీసీఎస్ (12,000 ఉద్యోగాలు), కాగ్నిజెంట్ (రూ. 1583 కోట్ల పెట్టుబడి, 8,000 ఉద్యోగాలు) త్వరలో విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి ఫలితంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్ల పై లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 95 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర, జనవరిలో దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన జరిపిన చర్చలు ఫలవంతమై రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని సాకారం చేసేందుకు… పెట్టుబడులు, ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయి.