Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!
- By Vamsi Chowdary Korata Published Date - 10:50 AM, Mon - 1 December 25
రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
భారతదేశంలో నదులకు ప్రముఖ స్థానం ఉంది. ఈ నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో.. వచ్చే గోదావరి పుష్కరాల తేదీలను ఆగమ, వైదిక పండితులు సూచించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని చెప్పారు. ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఇటీవల ప్రభుత్వానికి పంపించింది. ఈ నేపథ్యంలో పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులపై కరసత్తు ప్రారంభించారు.
గోదావరి పుష్కరాల తేదీలను పండితులు చెప్పిన నేపథ్యంలో రాజమహేంద్రవరంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టనున్న పనులపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75 వేల మంది వరకు వస్తారని అనుకుంటున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, యాత్రికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చుకునే గదులు, 6 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 18 గంటల్లో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో రద్దీని దృష్టిలో ఉంచుకుని గోదావరి నదికి ఇరు వైపులా.. 7.06 కిలో మీటర్ల మేర 97 ఘాట్‌లు నిర్మించనున్నారు. అందులో తూర్పువైపు 4.93 కిలోమీటర్ల పరిధిలో 45 ఘాట్‌లు సిద్ధం చేయనున్నారు. కాగా, పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులతో కమిటీలను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే అధికారులు పుష్కరాలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. పుష్కరాల కోసం వివిధ పనులు చేపట్టడానికి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 16 శాఖలు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. పుష్కరాల పనులపై చర్చించేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాలను.. అన్ని శాఖల సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో పుష్కర పనులకు మొదలుపెడతామని తెలిపారు.