ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు
- Author : Vamsi Chowdary Korata
Date : 13-01-2026 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార్లపై విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్యాక్స్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక మీదట రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు వేర్వేరు ధరలు ఉండవని అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బార్ల యజమానులకు భారీ ఊరటనిస్తూ, గత కొన్నేళ్లుగా అమలులో ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఏపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా మంగళవారం జారీ చేశారు. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు మేలు చేకూర్చనుంది. గత ప్రభుత్వ హయాంలో 2019 నవంబర్ నుంచి బార్లపై ప్రత్యేకంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును విధించారు.
దీంతో రిటైల్ షాపులతో పోలిస్తే బార్లలో మద్యం ధరలు ఎక్కువగా ఉండేవి. తాజా నిర్ణయంతో రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే బ్రాండ్ మద్యానికి రెండు రకాల ధరలు ఉండవు. రెండింటిలోనూ ఒకే రకమైన ధర ఉంటుంది. అలాగే ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్ , ఫారిన్ లిక్కర్ పై అదనపు పన్నులు ఉండవు. ఈ నిర్ణయం జనవరి 13 నుంచే అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
మందుబాబులకు షాక్ ..
మరోవైపు ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు ఉన్నవి మినహా అన్ని రకాల మద్యం ధరలు పెంచారు. పరిమాణంతో సంబంధం లేకుండా పది రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీరు, వైన్, రెడీ టు డ్రింక్ రేట్లను మాత్రం పెంచలేదు. అలాగే లిక్కర్ షాపుల యజమానులకు చెల్లించే రిటైల్ మార్జిన్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఒక శాతం మేరకు పెంచింది. బార్ లైసెన్స్‌దారులకు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ తొలగించారు.
ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్ల యజమానులు లిక్కర్ కొనుగోలుచేసేటప్పుడు అదనంగా ఈ ట్యాక్స్ విధించేవారు. అయితే ఈ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేయటంతో ఇకపై లిక్కర్ షాపు ఓనర్లు, బార్ల లైసెన్సుదారులు ఒకే ధరకు మద్యం కొనుగోలు చేయవచ్చు.
మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి చోట్ల త్రీస్టార్ లేదా అంతకంటే ఎక్కువ హోటల్స్‌లలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. మైక్రో బ్రూవరీ అంటే పెద్ద వాణిజ్య బ్రూవరీలతో పోలిస్తే చాలా తక్కువ పరిమాణంలో, అధిక నాణ్యత గల క్రాఫ్ట్ బీర్‌లను ఉత్పత్తి చేసే చిన్న బ్రూవరీ. వీటిని ఉత్పత్తి స్థలంలోనే వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల 3-స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వటంతో.. వ్యాపారవృద్ధికి అవకాశం ఉంది.